SERP CEO Veerapandian on Pension Distribution: రాష్ట్రవ్యాప్తంగా 88 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి అయ్యిందని సెర్ప్ రాష్ట్ర సీఈవో వీర పాండియన్ చెప్పారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 93 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత నెల పింఛను తీసుకోలేకపోయిన వారికి ఇవాళ రెండు నెలలది కలిపి చెల్లిస్తున్నామని అన్నారు. ఇలా గత నెల పించను తీసుకోలేకపోయిన వారు రాష్ట్రవ్యాప్తంగా 21,400 మంది ఉన్నారని తెలిపారు. భర్తను కోల్పోయిన వితంతువులకు వెంటనే పింఛను మంజూరు చేసేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
భర్త చనిపోయిన వారికి మరుసటి నెల నుంచే వితంతు పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇతర జిల్లాల్లో పింఛన్ పంపిణీ నెట్వర్క్ కారణంగా నిదానంగా జరుగుతోందని అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం అయినందున శనివారం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సెర్ప్ సీఈవో వీర పాండియన్ వెల్లడించారు.
CM Chandrababu in Pensions Distribution: అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం రుద్రమ్మకు స్వయంగా సీఎం పెన్షన్ అందించారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వారికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. భాగ్యమ్మ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను 15 వేల రూపాయలను అందించారు. నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!