NTR Mana Desam Movie : ఆ రూపం మనోహరం. అభినయ వేదం. నటనకు విశ్వవిద్యాలయం. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం. తెలుగుజాతి ఐక్యతా చిహ్నం. వెండితెరవేల్పు. మేలుకొలుపు. ప్రేక్షక ప్రపంచ ఆరాధ్యదైవం. తెలుగుసినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం. పౌరాణికం, చారిత్రకం, సాంఘికం, జానపదం ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం. ఆకర్షించే ఆహార్యం. ఆకట్టుకునే అభినయం. అలరించే గళం. సుస్వర భాస్వరం. వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ వరం.
తెలుగుజాతి ఐక్యతను ఆకాంక్షించిన తెలుగోడు. జన హృదయాల్లో ఎన్టీవోడు. ఆయనే నందమూరి తారక రామారావు. మరి ఆయన తెరగేంట్రం చేసిన మొదటి సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఓరోజు తెలుగు సినీ దర్శకుడు, దార్శనికుడు, నిర్మాత, ఎల్వీ ప్రసాద్ దగ్గర ఓసారి నిర్మాత బియ్యే సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటో చూశారు. నిర్మాత బీయ్యే సుబ్బారావు స్క్రీన్ టెస్ట్ కోసం కబురు చేశారు. ఉన్నపళంగా రైలెక్కి మద్రాసు రావాలని కోరారు. టెస్ట్ పూర్తయ్యాక మరో ఆలోచన లేకుండా తను తీస్తున్న పల్లెటూరిపిల్ల సినిమాలో ఎన్టీఆర్‌కి అవకాశమిచ్చారు.
సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎన్టీఆర్ నటన చూసిన ఎల్వీప్రసాద్ తను తీస్తున్న మనదేశం సినిమాలో అవకాశం ఇచ్చారు. గమ్మత్తుగా బీయ్యే సుబ్బారావు సినిమా పల్లెటూరిపిల్ల కంటే ముందు, ఎల్వీప్రసాద్ సినిమా మనదేశం విడుదలైంది. అందులో సత్యాగ్రహుల మీద లాఠీచార్జి చేసే క్రూర పోలీసు అధికారిగా నెగెటివ్ షేడ్ పాత్రలో ఆయన నటించారు. అవకాశాలను పాజిటివ్‌గా మలుచుకోవటానికి నెగెటివ్ పాత్రలయినా ఫర్వాలేదనుకున్నారు. అలా సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత కాలంలో వెండితెరమీద అగ్రహీరోగా నిలిచారు. మనదేశం చిత్రంలో ఎన్టీఆర్‌ది ఒక డైలాగు ఉంది. ఇంతవాణ్ణి కావటానికి ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా? ఆ సంభాషణ ఆ తర్వాత కాలంలో అచ్చంగా, అక్షరాల ఎన్టీఆర్ జీవన క్రమానికి సరిపోయింది.
75 years of Mana Desam Movie : ఎన్టీఆర్ మొదటి చిత్రం మనదేశం విడుదలై నవంబర్ 24కి 75 ఏళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా తారకరామం పేరుతో పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ ప్రతీ ఇంటర్వ్యూని ఆ పుస్తకంలో పొందుపరిచామని తెలుగుదేశం నేత టీడీ జనార్దన్ వెల్లడించారు.
NTR Birthday : కారణజన్ముడు.. తారకరాముడు.. ఆయనకు మాత్రమే సాధ్యమైన ఘనతిది!
ఎన్టీఆర్.. కెరీర్లోనే ఎక్కువ టేకులు తీసుకున్న సినిమా ఏంటంటే?