Scientist G Satheesh Reddy Gets Mandali Award: రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం త్వరలో 50 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల రూపాయిల స్థాయికి ఎదిగే అవకాశం ఉందని భారత రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ జీ.సతీష్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి వెంకట కృష్ణారావు స్మారక తెలుగు వైభవ పురస్కారాన్ని డాక్టర్ సతీష్ రెడ్డి అందుకున్నారు.
భారత రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని మండలి ఫౌండేషన్ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ ప్రధానం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సతీష్ రెడ్డి తెలుగువాడు కావడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగు జాతి తలెత్తుకుని తిరిగేలా చేసిన సతేష్ రెడ్డి పురస్కారం పొందడానికి అవనిగడ్డకు రావడం అదృష్టంగా బావిస్తున్నానని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. 140 కోట్లు ఉన్న భారత దేశ ప్రజలు హాయిగా నిద్ర పోవాలంటే సతేష్ రెడ్డి లాంటి శాస్త్రవేత్తలు చాలా అవసరమని కొనియాడారు.
భారతరక్షణ శాస్త్రవేత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం తనకు అందించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారాన్ని తనకు అందించటం శాస్త్రవేత్తలు అందరికి దక్కిన గౌరవమని అన్నారు. తెలుగువారి కోసం తెలుగు భాష, అభివృద్ధి కోసం మండలి కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. రాబోయే రోజుల్లో నిమ్మకూరు దగ్గర ఏర్పాటు చేస్తున్న బెల్ కంపెనీ, నాగాయలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదం పడుతాయని పేర్కొన్నారు. మండలి పురస్కారాన్ని తనకు అందించినందుకు మండలి ఫౌండేషన్‌కు, బుద్ధ ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ సతీష్ రెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ దుర్గాప్రసాదరావు, ఆత్మీయ అతిధులు, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కూచిభోట్ల ఆనంద్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్, అవనిగడ్డ బస్టాండ్ సెంటరులో అదే విధంగా గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్ జి. సతీష్ రెడ్డిని ఘనంగా సత్కరించి, మండలి వెంకట కృష్ణారావు స్మారక తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేశారు.
తల్లిదండ్రులే స్ఫూర్తి- కళా రంగాల్లో రాణిస్తున్న యువతి - Meda Sindhu Shri From Vijayawada