Telangana DSC 2024 : ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ(TG DSC 2024) దరఖాస్తులకు గడువు పొడిగిస్తున్నట్లు స్కూల్‌బోర్డు స్పష్టం చేసింది. జూన్ 20 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇక జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - పోస్టుల వివరాలు ఇవే
DSC Application Date Extended : తొలుత నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు, మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. నేటితో దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల టెట్(TET 2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ, అందులో అర్హత సాధించిన వారికి సైతం డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించే ఉదేశంతో, దరఖాస్తు గడువును పొడిగించింది.
టెట్‌లో అర్హత సాధించని విద్యార్థులు, నూతనంగా డీఎడ్, బీఎడ్ చేసిన విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గత నెల మార్చి 14న విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో, మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. మే 23 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ బేస్డ్(ఆన్‌లైన్) విధానంలో టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
TG Mega DSC Notification 2024 : మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర సర్కారు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరి కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 పోస్టులను భర్తీ చేయనుంది. జులై 1వ తేదీ 2023నాటికి 18 ఏళ్లు పూర్తి అయి 46 ఏళ్లు లోపు ఉన్నవారు డీఎస్సీ రాసేందుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. గతేడాది బీఆర్ఎస్ సర్కార్ విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పోస్టుల సంఖ్య పెంచిన నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
టీఎస్ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల - జులై 17 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్
టీఎస్పీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్2 పరీక్షలు