SHAR Director Rajarajan Comments: దేశంలో ఉన్నసాంకేతిక సమస్యలను పరిష్కరించటానికి అధునాతన టెక్నాలజీలైన మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సులను వినియోగించాలని శ్రీహరికోట సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో డైరెక్టర్ ఏ.రాజరాజన్ అన్నారు. భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, నగరాలలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుందన్నారు.
కానూరులోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటిలో ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీస్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా 602 పత్ర సమర్పణలు రాగా అందులో 143 హైక్వాలిటీ పత్రాలను ఈ సదస్సులో ఎంపిక చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో డైరెక్టర్ ఏ.రాజరాజన్ పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, విద్యార్ధులు తెలుసుకోవాల్సిన అంశాలపై రాజరాజన్ ప్రసంగించారు.
మనం వినియోగించే కృత్రిమ వనరుల స్థానంలో సహజ వనరులను వినియోగించేలా ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రస్తుతం జనాభా 11 బిలియన్లకు చేరుకున్న తరుణంలో చంద్రుడు, అంగారక గ్రహం, ఇతర గ్రహాలకు వెళ్లటానికి సాంకేతిక పరిశోధనలు చేయాలన్నారు. 2040 నాటికి ఇస్రో మిషన్ చంద్రుడుపై దిగుతుందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహం నుంచి ఖనిజాలను పరీక్ష నిమిత్తం సేకరిస్తున్నామన్నారు. ఇస్రో కేవలం పరిశోధనలోనే కాకుండా వైద్య రంగం, సైకాలజీలో కూడా పాల్గొంటుందన్నారు.
హరిత సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి పెరగాలని చెప్పారు. యువత స్థిరమైన ఆలోచనలతో ముందుకురావాలని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. మారుతున్న సాంకేతిక జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. సదస్సు ఆనంతరం సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో డైరెక్టర్ ఏ.రాజరాజన్‌ను ఘనంగా సత్కరించారు.
విద్యార్థి త్రయం వినూత్న ఆవిష్కరణ- ఆస్పత్రుల్లో హైబ్రిడ్ మెడికల్ బెడ్ - Hybrid Medical Bed Mattress