Voters Returned To Hyderabad After Voting : వరుస సెలవులు, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సొంతూళ్లకు ఓటేయడానికి వెళ్లిన వారందరూ పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, ఏపీ నుంచి తిరిగొస్తున్న ప్రయాణికులతో నగరంలోని మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా నగరానికి చేరుకున్న ప్రయాణికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మెట్రోను ఎక్కువగా వినియోగించడం వల్ల హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది.
ఎల్బీ నగర్-మియాపూర్ మార్గంలో ప్రయాణికులతో మెట్రోలు కిక్కిరిసిపోయాయి. మెట్రో రైలులో చాలా మంది నిలబడి ప్రయాణిస్తున్నారు. కొన్ని రైళ్లలో అయితే నిలబడడానికి కూడా గ్యాప్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఓటర్ల తిరుగు ప్రయాణంతో ఈరోజు ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అరగంట ముందే అధికారులు మెట్రో రాకపోకలను సాగించారు. అయినా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ట్రిప్పులు నడపాలని హైదరాబాద్ మెట్రో యోచిస్తోంది. దీనికి తోడు ఆఫీసులకు వెళ్లే వారు కూడా రావడంతో స్టేషన్లలో రద్దీ ఎక్కువగా పెరిగింది.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా రద్దీ : మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలకు వెళ్లిన ఏపీ ప్రజలు తిరిగి నగరంలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజాలో 16 గేట్లుండగా హైదరాబాద్ వైపు పది గేట్లను తెరిచారంటే రద్దీ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 95 శాతం వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఉండటంతో త్వరగా స్కానింగ్ చేసి వాహనాలను పంపుతున్నారు.
ఏపీకి 'ఓటెత్తిన' పౌరులు- రహదారులు కిటకిట - Bus Stands Rush With AP Voters
ఏపీకి వెళ్లినప్పుడు ఇదే రద్దీ : సోమవారం రోజున ఏపీలో జరిగిన ఎన్నికలకు హైదరాబాద్ నుంచి శనివారం, ఆదివారాల్లో విజయవాడ, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వెళ్లారు. దీంతో నగరంలోనూ, నగర శివారు ప్రాంతాల్లోనూ ఎక్కడిపడితే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. మళ్లీ ఇప్పుడు తిరుగు ప్రయాణంలోనూ ఈ రద్దీ తప్పడం లేదు.