RTC Employees Problems Due to YSRCP Government : వైఎస్సార్సీపీ సర్కారు చేసిన తప్పిదం ఆర్టీసీ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. జీవో 114లో అలవెన్సుల ప్రస్తావన చేయకపోవడంతో ఒక్కో ఉద్యోగి లక్షల్లో నష్టపోయారు. సమస్యను పరిష్కరించి ఆర్టీసీ ఉద్యోగులందరికీ అలవెన్సుల మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినా ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఫైల్ ముందుకు కదల్లేదు. ఫలితంగా ఖాతాల్లో సొమ్ము జమకాక ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ఆర్టీసీ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలకు నిరంతరం రవాణా సేవలందిస్తోన్న ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం పలు రకాల అలవెన్సులను అమలుచేస్తోంది. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఈ అలవెన్సులను గత వైఎస్సార్సీపీ సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో 2020 జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లకు నిలిచిపోయాయి. అలవెన్సుల కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టినా వైఎస్సార్సీపీ సర్కారు కనీసం స్పందించలేదు. అలవెన్సులు మంజూరు చేయాలని అన్ని సంఘాల నేతలు అప్పటి సీఎం జగన్ కు లేఖలు రాసినా అవి బుట్టదాఖలయ్యాయి.
దీంతో నెలకు 4వేల చొప్పున ఒక్కో డ్రైవర్ లక్షల్లో నష్టపోయారు. ఉద్యోగులు ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఊహించిన జగన్ తూతూ మంత్రంగా ఓ జీవో జారీ చేయించారు. జీవోలో నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని స్పష్టంగా తెలియజేయలేదని నైటౌట్ అలవెన్సులు పేరు చేర్చి జీవో సవరణ చేస్తే మంజూరు చేస్తామని ట్రెజరీ అధికారులు తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ సర్కారు మోసపూరిత వైఖరి అస్పష్ట జీవో వల్ల వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు అలవెన్సులు రాక అష్టకష్టాలు పడుతున్నారు.
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం చర్యలు!
'అలవెన్సుల సమస్యను పరిష్కరించాలని ఆర్టీసీలోని ప్రధాన ఉద్యోగ సంఘాలైన ఎన్ఎంయూ, ఈయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ , కార్మిక పరిషత్ నేతలు సీఎం చంద్రబాబును కలవడం సహా లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బందికి అలవెన్సులు ఆపడం సమంజసం కాదని, సమస్యను వెంటనే పరిష్కరించాలని మూడు నెలల క్రితమే సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో గతంలో వైఎస్సార్సీపీ సర్కారు జారీ చేసిన జీవో లో నైటౌట్ సహా పలు అలవెన్సులు ఇవ్వాలని సవరించి, దస్త్రాన్ని సిద్ధం చేసి ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపారు. దానిని వెంటనే అమలు చేయాల్సిన ఆర్థికశాఖ అధికారులు ఫైల్ వచ్చి రెండు నెలలైనా కొర్రీలు వేస్తూ ఆమోదముద్ర వేయలేదు.' -వై. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ కార్మిక పరిషత్
కొర్రీలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినా ఆమోదం తెలపకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎన్ఎంయూ, ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు ఫైనాన్స్ సెక్రటరీకి లేఖలు రాసినా స్పందన లేదు. దీంతో ఈ నెల కూడా సిబ్బందికి అలవెన్సులు మంజూరు కాలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తీరుతో వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
విలీనంతో ప్రయోజనాలు పెంచాల్సిన వైఎస్సార్సీపీ సర్కారు దశాబ్దాలుగా అమలవుతోన్న కీలక ప్రయోజనాలను తొలగించడంతో ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని ఆ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నామని సత్వరం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.