Tadipatri Road Accident Today : నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు.
తాజాగా అప్పటిదాకా వారు బంధువుల రిస్పెషన్ వేడుకలో సరదాగా గడిపారు. బంధువులు, మిత్రులతో ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇక తిరిగి వారి స్వగ్రామానికి బయల్దేరారు. కానీ అదేవారికి చివరిరోజు అవుతుందని వారికి తెలియదు. ఊహించని రోడ్డు ప్రమదం వారిని విగత జీవులుగా మార్చింది. అప్పటి వరకూ తమ కళ్లముందు ఉన్న బంధులు మృత్యువాత పడ్డారని విషయం తెలుసుకొని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
Road Accident in Anantapur : తాడిపత్రి మండలం వంగనూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. తాడిపత్రి మండలంలోని గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డి (25), వెంకటలక్ష్మి(45), ప్రమీల(22) బంధువుల రిసెప్షన్ కోసం కడప జిల్లా వేంపల్లికి వెళ్లారు. వేడుక అనంతరం తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు.
Bondaladinne Road Accident : మార్గమధ్యలో వంగనూరు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రతాప్‌రెడ్డి, ప్రమీల అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన వెంకటలక్ష్మిని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిదని చెప్పారు.
బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. తమ వారు చనిపోయారనే మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. తమతో వారు సంతోషంగా గడిపిన క్షణాలను తలచుకొని రోదించారు.