Bolero Collided with Two Wheeler : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొని బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిగా, 23 మంది గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాణి మండలం గుత్తివారిపల్లి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపంజాణి మండలంలోని మారప్పల్లెకు చెందిన సుమారు 25 మంది పలమనేరు మండలంలోని గుండ్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై బొలెరో వాహనంలో స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు.
గుత్తివారి పల్లె సమీపానికి చేరుకోగానే పలమనేరు చెందిన మణి (43) ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఒక్కసారిగా ఎదురెదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న మణి అక్కడికక్కడే మృతి చెందగా, బొలెరో వాహనంలోని 23 మందికి గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థాలానికి చేరుకొని క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చిత్తూరులోని ఆస్పత్రికి రిఫర్ చేశారు.
రెప్పపాటులో ఘోర ప్రమాదం - ఛిద్రమైన శరీర భాగాలు - ఏడుగురు మృతి - Road Accident in Chittoor District
ప్రమాద విషయం తెలుసుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి అండగా ఉంటామని దైర్యం చెప్పారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ శారదమ్మతో పాటు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి క్షతగాత్రులకు త్వరితగతిన చికిత్సలు అందేలా చూశారు. ఇలా ఉండగా పరిస్థితి విషమంగా ఉన్న ఎనిమిది మందిని స్థానిక వైద్యులు చిత్తూరుకు రిఫర్ చేయగా 108 వాహనాలు ఆలస్యంగా రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై చిత్తూరు డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి వాహనాల ఆలస్యంపై ఫిర్యాదు చేశారు. అనంతరం క్షతగాత్రులను తరలించేంతవరకు ఆస్పత్రి వద్దే ఉండి ఆయన పర్యవేక్షించారు.