Road Accident And People Un Bothered Towards Victims in Vizianagaram : అక్కడ ట్రాక్టర్ ఢీకొట్టి యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కుమారుడ్ని చూస్తూ కన్నతల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. తీవ్రరక్త స్రావంతో పడి ఉన్న బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కాస్త సాయం చేయండయ్యా అంటూ ఆ మాతృమూర్తి వేడుకున్నా ఎవ్వరూ కనికరించలేదు. యువకుడి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా.. మాకేం సంబంధం అంటూ వెళ్లిపోగా.. మరికొందరు ఫొటోలు తీస్తూ ఉండిపోయారు. అంబులెన్స్ వచ్చేసరికి యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన విజయనగరంలో జరిగింది. తీరా 108 అంబులెన్సు వచ్చేసరికే ఆమె కుమారుడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన విజయనగరంలోని వైఎస్సార్ కూడలి- గూడ్స్ షెడ్డు వద్ద చోటు చేసుకుంది.
టైరు పగిలి లారీ కిందకు దూసుకెళ్లిన కారు - ఆరుగురు మృతి
కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన యువకుడు : స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన కె.గంగధారరావు (30) తల్లి గోవిందమ్మతో కలిసి ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్డు వంతెన దగ్గరి పని ఉందని దిగాడు. ఒక్క అడుగు ముందుకు వేసే సరికి ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో అతడు తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయాడు. గంగాధర రావును చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగున వచ్చి లేపేందుకు ప్రయత్నించింది. ‘అయ్యా బాబూ... రండయ్యా హాస్పిటల్‌కు తీసుకువెళ్దాం’ అంటూ ఎంత మందిని బతిమిలాడినా ఎవరూ కనికరించలేదు.
పెళ్లింట విషాదం - రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు
అసలు మానవత్వం బతికే ఉందా : ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ఉన్నా ఎవరూ సాయం చేయలేదు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలం నుంచి కిలో మీటరు దూరంలోనే మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అక్కడి నుంచి 5 నిమిషాల్లోపే ఆసుపత్రికి వెళ్లగలరు. కానీ చుట్టూ ఎవరూ స్పందించలేదు. ఎవరో స్థానికులు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రమాదం జరిగింది. అంబులెన్సు మాత్రం అరగంట తర్వాత 1.15కు వచ్చింది. అప్పటికే ఆ యువకుడి పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
గోవిందమ్మ ఇద్దరు కుమారుల్లో గంగాధర రావు చిన్నవాడు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో చిన్న పాన్‌షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. యువకుడి తల్లి గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.