AP Govt Focus on YSRCP Land Grabs : వైఎస్సార్సీపీ పాలనలోని భూదందాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తంగా 3 నెలల్లో నవంబర్ 15లోగా ఫిర్యాదుల స్వీకరణ, చర్యల ప్రక్రియ పూర్తికానుంది. భూముల వ్యవహారాలతో సంబంధమున్న అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్లనున్నారు. వీలుంటే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్లపై ఉన్న లోగోలు, పేర్లను చెరిపేయాలని సర్కార్ సూచించింది. వైఎస్సార్సీపీ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ పేరుతో తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లపైనా సదస్సుల్లో విచారించనున్నారు.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. కొందరు కావాలనే కుట్రపూరితంగా భూరికార్డులను దహనం చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం మదనపల్లెకు వెళ్లిన సిసోదియాకు బాధితుల నుంచి సుమారు 500 ఫిర్యాదులు అందాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల వల్ల సొంత భూములు కోల్పోయామని బాధితులు వివరించారు.
Lands Encroachment in YSRCP Govt : మరోవైపు టీడీపీ, జనసేన కార్యాలయాల్లో నిర్వహిస్తున్న విన్నపాల స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు, ఇతర నేతలకు అందుతున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా భూదందాలవే ఉంటున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విశాఖ, ఒంగోలు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్, విలువైన ఇతర భూములను వైఎస్సార్సీపీ నేతలు, కొందరు ఉన్నతాధికారులు కొట్టేశారు. ఇలాంటి అక్రమాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని సవరించనుంది.
గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు : ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న ఈ సదస్సులు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సైతం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రత్యేకంగా జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని సదస్సుల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ, తదుపరి చర్యలను స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
అదేవిధంగా సదస్సుల నిర్వహణ సమన్వయకర్తగా జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొంది. గ్రామాలవారీగా రెవెన్యూ సభల నిర్వహణ తేదీలను సబ్‌కలెక్టర్, ఇతర అధికారులు ఈ నెల 13లోగా ఖరారు చేస్తారని చెప్పింది. మండలాలవారీగా పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించింది. సదస్సుల నిర్వహణకు ముందుగానే ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఎన్జీఓలతో సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను జిల్లా కలెక్టర్ వివరించాలని తెలిపింది.
Inquiry on Land Irregularities in AP : తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్, దేవాదాయ, వక్ఫ్‌బోర్డుల ప్రతినిధులు, అటవీ, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధులతో కమిటీని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామసభల నిర్వహణపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. రెవెన్యూ సదస్సులకు సంబంధిత గ్రామమ్యాప్‌లు, ఆర్వోఆర్, 1బి/అడంగళ్/ప్రభుత్వ భూముల రిజిస్టర్లు సిద్ధం చేయాలని తెలిపింది.
ఫిర్యాదుల నమోదుకు విడివిడిగా రిజిస్టర్లు : వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూములకు తగ్గట్టు వివరాలు అందుబాటులో ఉండాలని బాధితుల ఫిర్యాదులను వర్గీకరించాలని వివరించింది . మ్యుటేషన్లు, వివాదాలు, ఆక్రమణలు, నిషిద్ధ 22ఏ జాబితా నుంచి భూములు తప్పించడంపై వచ్చిన ఫిర్యాదుల నమోదుకు విడివిడిగా రిజిస్టర్లు నిర్వహించాలని పేర్కొంది. బాధితులకు ఫిర్యాదు స్వీకరణ రసీదు ఇవ్వడంతోపాటు పరిష్కార చర్యలపై తెలుగులోనే సమాధానమివ్వాలని స్పష్టం చేసింది.
ఇందుకోసం ప్రత్యేక నమూనాలు సైతం రూపొందించింది. ప్రతిరోజూ ఉదయం తొమ్మిదింటికి సదస్సు ప్రారంభం కావాలని గ్రామసభల వారీగా ఆన్‌లైన్‌లో నమోదయ్యే ఫిర్యాదుల స్వీకరణ, ఇతర వివరాలను రాష్ట్రస్థాయిలో నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపింది. రీ-సర్వే అయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణకు ఆదేశాలు : వైఎస్సార్సీపీ పాలనలో నిషిద్ధ జాబితా 22ఏ నుంచి తొలగించిన భూముల విషయంలో అవకతవకలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 2019 ఏప్రిల్ 1 తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలను గుర్తించి వెంటనే కలెక్టర్‌కు జిల్లా రిజిస్ట్రార్ నివేదించాలని సర్కార్ ఆదేశించింది. సర్వే నంబర్లను తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలలు నిలిపేయాలని జిల్లాల అధికారులకు స్పష్టం చేసింది.
వైఎస్సార్సీపీ హయాంలో అసైన్డ్, చుక్కల భూములు, షరతులున్న భూములను లక్షల్లో నిషిద్ధ జాబితా నుంచి తప్పించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో 360.76 ఎకరాలు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 182.02, వైఎస్సార్ జిల్లా ఎస్.మైదుకూరు మండలంలో 206.87, ఇలాగే శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలకు గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ప్రక్రియలో క్రయవిక్రేతలు జతపర్చిన ధ్రువపత్రాలను మరోసారి పరిశీలిస్తారు.
ఆ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టాలి : ఫ్రీహోల్డ్ భూముల పేరుతో ప్రభుత్వ, పోరంబోకు భూములకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై కలెక్టర్లు విచారించి నివేదించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు అందితే వాటిని పెండింగ్‌లో పెట్టాలని సబ్‌రిజిస్ట్రార్లకు స్పష్టం చేసింది.
పెద్దిరెడ్డి చెరలో 236 ఎకరాలు - ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు - Peddireddy Land Grabs