RP Sisodia on AP Floods : రాష్ట్రంలో 10 రోజుల పాటు కృష్ణా, గోదావరి వరదలు ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ కలెక్టరేట్లోనే ఉండి పర్యవేక్షించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆయనే స్వయంగా వరద నీటిలో తిరిగి బాధితుల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు ఏం చేయాలో అధికారులకు, సిబ్బందికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని సిసోదియా వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కార్యాచరణ, బాధితులకు సాయం అందించిన అంశాన్ని కేంద్రం కూడా ప్రశంసించిందని సిసోదియా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా జాతీయ, రాష్ట్ర విపత్తు మార్గదర్శకాలను మించి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లు జారీకి సర్కార్ ఆదేశాలు ఇచ్చిందని సిసోదియా వెల్లడించారు
Free certificates to AP flood Victims : సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల నకళ్లు జారీ చేస్తామని సిసోదియా తెలిపారు. బాధితులకు ఉచితంగానే వీటిని ఇవ్వాలని సర్కార్ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు వివరించారు. జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచి వారం పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సిసోదియా పేర్కొన్నారు.