High Court not to arrest Pinnelli and other Candidates : ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా (మే 13న) చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్‌రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.
ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు షరతులతో అరెస్టు నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం (EVM)ను ధ్వంసం చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవే అని కోర్టుకు వివరించారు.
ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్ట్ చేయొద్దని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఆదేశాలున్నాయని వివరించారు. పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఓట్ల లెక్కింపు వరకూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని వాదించారు. మరోవైపు పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి బెయిలు మంజూరు చేయొద్దని కోరారు. ఆయన అల్లర్లు సృష్టించారని, పిటిషనర్‌పై దాడిచేసి గాయపరిచారని చెప్పారు. బాధితుడిగా వాదనలు చెప్పుకొనేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు.
తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలుకు సమయం కావాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు. ఓట్ల లెక్కింపు రోజున మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో నేర ఘటనలు మళ్లీ జరగకుండా పిటిషనర్లను ఆదేశించాలని కోరారు. అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే ఆ ఉత్తర్వులను పోటీచేసే అభ్యర్థులకే పరిమితం చేయాలని వాదించారు. అందరి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి షరతులతో అరెస్టు నుంచి ఉపశమనం కల్పించారు.
పిటిషనర్లు నలుగురికి మించి ఎవరితోనూ తిరగడానికి వీల్లేదని షరతు విధించారు. అభ్యర్థుల కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని అక్కడి వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులకు షరతు విధించారు.కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కలిక బెయిల్‌కు ఉత్తర్వులిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలుచేయాలంటూ విచారణను జూన్ 6కి వాయిదా వేశారు.
నరసరావుపేటలో టెన్షన్ - పిన్నెల్లి కోసం కోర్టు ఆవరణలో పోలీసుల పహారా