Red Sandalwood Smugglers Kill Constable Ganesh : అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు ప్రయత్నం చేశారు.
కానిస్టేబుల్ గణేశ్ నుంచి తప్పించుకునే క్రమంలో అతడిని వాహనంతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. పోలీసులు గాలింపు చేపట్టి ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించారు.
చినగంజాం జాతీయ రహదారిపై ప్రమాదం - యువకుడు మృతి
రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ : తిరుపతి జిల్లా నాయుడుపేట - పుతలపట్టు జాతీయ రహదారిపై తిరుపతి బాలాజీ డైయిరీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులకు గాయాలు ఇయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రుయా అస్పత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై నుంచి తిరుపతి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును ఢీ కొట్టిన టిప్పర్ ఆగకుండా వెళ్ళిపోయింది. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు.
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ - ఇద్దరు కాపరులు దుర్మరణం
బేస్తవారిపేటలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలు మార్కాపురానికి చెందిన రూతు మేరీ(52)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు పోరుమామిళ్లలో ఓ వివాహానికి హాజరై తిరిగి మార్కాపురం వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గాయపడ్డ మిగతా నలుగురు ప్రస్తుతం కంభం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.