Realtor Attempts to Grab Dalit Lands : కర్నూలులో రూ. 200 కోట్ల విలువైన దళితుల భూములపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నేశారు. ముగ్గురు ప్రజాప్రతినిధుల అండతో భూములను లాగేసుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. వెంటనే ఖాళీ చేయాలంటూ దళితులపై బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసుల సాయంతో ఎలాగైనా భూములను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తరాలుగా భూములను తాము సాగు చేసుకుంటున్నామన్న దళితులు వాటిని కాపాడుకునేందుకు ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Dalit Land issues in Kurnool : కర్నూలు శివారులోని మునగాలపాడులో ఉన్న 200 ఎకరాల దళితుల భూములపై ఓ స్థిరాస్తి వ్యాపారి కన్నేశారు. ఆయా భూముల విలువ 200 కోట్లకు పైగా ఉండటంతో ఎలాగైనా దక్కించుకోవాలని ముగ్గురు ప్రజాప్రతినిధుల సహకారంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మునగాలపాడులో గత వందేళ్లుగా సుమారు 50 నుంచి 60 మంది దళితులు వారసత్వంగా ఆయా భూముల్ని సాగు చేసుకుంటున్నారు. అందుకు తగిన ఆధారాలు వారి దగ్గర ఉన్నాయి. పలువురికి అధికారులు పట్టాలు కూడా ఇచ్చారు. అయితే రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూములుగా చూపడం వారికి శాపంగా మారింది.
దొరికినంత దోచుకో - పంచుకో - విశాఖలో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు
ఆయా భూములకు సమీపంలోనే జాతీయ రహదారి ఉండటం, మరోవైపు చెన్నై - సూరత్ ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మిస్తుండటంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఎకరం కోటికి పైగా పలుకుతోంది. కర్నూలుకు కూతవేటు దూరంలోనే ఉన్నందున వాణిజ్య అవసరాలకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో ఓ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా మారిస్తే కోట్లలో ఆదాయం వస్తుందని ఓ స్థిరాస్తి వ్యాపారి భావించారు. ఆ భూమిని సేకరిస్తే ఫిలిం సిటీ ప్రాజెక్టును సంయుక్తంగా నిర్వహించుకోవచ్చని ముగ్గురు ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. వారు అంగీకరించడంతో దళితులను ఖాళీ చేయించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత
కార్పొరేషన్ అధికారుల బెదిరింపులు : కొందరు అధికారులతో కలిసి ప్రణాళికలు రచించిన వారు దళితుల్ని బెదిరించడం మొదలుపెట్టారు. పంటలు సాగు చేయొద్దని, ఒకవేళ చేసినా ప్రొక్లెయిన్లతో తవ్వేస్తామని హెచ్చరిస్తున్నారు. చివరికి బీడుగా ఉన్న భూముల్లో ఎవరూ అనుభవంలో లేరని చూపించి రానున్న రోజుల్లో కొందరు పెద్దలకు అధికారికంగా కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేయాలంటూ కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తున్నారని పలువురు దళితులు సోమవారం జిల్లా కలెక్టర్ సృజనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
రైతుల ఆవేదన : ప్రభుత్వం, స్థానిక అధికారులు తమ భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!