Ratha Saptami Celebrations in Andhra pradesh : రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా కర్నూలులోని సాయి పతాంజలి యోగ కేంద్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యోగా కేంద్రంలో సూర్య నమస్కారాలు చేశారు. భూమండలానికి సూర్యుడే ఆధారమని, సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని యోగ గురువులు తెలిపారు.
తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు -తితిదే
Kadapa Ratha Saptami vedukalu : కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో సందడి నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.
తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు ఆరంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. వేడుకల సందర్భంగా మలయప్ప స్వామి సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహనసేవలను గ్యాలరీ నుంచి భక్తులు వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను, పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాత్రి 8గంటల వరకు చంద్రప్రభ వాహనసేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.
Ratha Saptami in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి దర్శనం కోసం కర్ణాటక రాష్ట్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
సత్యసాయి జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించిన అర్చకులు విశిష్ట పూజలు చేశారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై ఖాద్రీపురుషీడికి తిరువీధుల ఉత్సవాన్ని నిర్వహించారు.
కృష్ణా జిల్లాలో వైభవంగా రథసప్తమి వేడుకలు
Ratha Saptami at Lakshmi Narasimha Temple :రథసప్తమిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ సూర్యనారాయణ మూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారి మూలవిరాట్‌కు అర్చకులు అభిషేకాలు చేశారు. సూర్య భగవానుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే దర్శనమిచ్చే ఆదిత్యుని నిజరూప దర్శనం వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.