Rashmi Excelling in Javelin Throw in Guntur District : అమ్మాయిలు ఆటల్లోకి వెళ్తామంటే అండగా నిలిచేవారు తక్కువ. అలాంటి పరిస్థితుల్లో అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకుందీ యువతి. వివాహమైనా తనలోని క్రీడాసక్తిని మరువలేదు. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా భర్త ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా 3 బంగారు పతకాలు సాధించి వారెవ్వా అనిపించింది.
ప్రాక్టీసు కొనసాగిస్తూ పతకాలు : వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి జావెలిన్ త్రో విసురుతున్న ఈమె పేరు రష్మీ. గుంటూరు స్వస్థలం. చిన్న వయసులోనే క్రీడల్లో రాణించాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా భిన్నమైన క్రీడను ఎంచుకోవాలని భావించింది. అథ్లెటిక్స్‌లో అమ్మాయిల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని గ్రహించి జావెలిన్ త్రో క్రీడను ఎంచుకుంది. 15 ఏళ్ల వయసులో జావెలిన్‌ని చేత బట్టిన రష్మీ వడివడిగా అందులోని నైపుణ్యాలను అందిపుచ్చుకుంది. రాష్ట్ర, జాతీయ టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచి పతకాలు సొంతం చేసుకుంది. వివాహం అయిన కానీ, జావెలిన్ త్రోని జార వదల్లేదు. తన భవిష్యత్తు జావెలిన్ త్రో క్రీడపైనే ఆధారపడిందని గుర్తించి ప్రాక్టీసు కొనసాగిస్తూ పతకాలు సాధిస్తోంది.
ఈ స్థాయిలో ఉండడానికి హార్డ్‌వర్క్, తల్లిదండ్రులే కారణం - ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం'
30కి పైగా పతకాలు : జావెలిన్ త్రోలో అమ్మాయిల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటుంది. ఆ అవకాశం అందిపుచ్చుకున్న రష్మీ పాల్గొన్న ప్రతి టోర్నీలో పతకాలు సాధిస్తోంది. ఇటీవల జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా 3 బంగారు పతకాలతో మెరిసింది. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. నేషనల్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్, నేషనల్ ఇంటర్ జోనల్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించింది రష్మీ. ఆలిండియా ఇంటర్ రైల్వే అథ్లెటిక్స్ టోర్నీలో గోల్డ్‌తో మెరిసింది. 61వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్, నేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ పోటీల్లో రజత పతకాలు గెలుచుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుమారు 30కి పైగా పతకాలు సాధించింది.
శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'
నేను ప్రస్తుతం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ జావెలిన్ త్రోలో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పుటి వరకు జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించాను. భవిష్యత్తులో అంతర్జాతీయ పతకాలే లక్ష్యంగా సాధన చేస్తున్నాను-రష్మీ, జావెలిన్ త్రో క్రీడాకారిణి
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా : గుంటూరులో రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే జావెలిన్ త్రో సాధన చేస్తుంది రష్మీ. భర్త దుర్గారావు ఈమెకు అన్నివిధాల అండగా నిలుస్తున్నాడు. అతడూ క్రీడాకారుడు కావడంతో ఆసియా, కామన్వెల్త్ లాంటి అంతర్జాతీయ టోర్నమెంటులో పతకాలు సాధించే దిశగా భార్యను నడిపిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అంతర్జాతీయ పతకాలే లక్ష్యంగా పంజాబ్, హరియాణా పంపించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు దుర్గారావు చెబుతున్నాడు.
ఈ సంవత్సరం నా భార్య సాధించిన విజయాలకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈమెకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రస్తుతం పంజాబ్‌లో శిక్షణ తీసుకుంటుంది. అక్కడ శిక్షణకు కావలిసిన ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం. ప్రభుత్వం క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు, కోచ్‌లు ఏర్పాటు చేస్తే మరి కొంత మంది ఈ ఆటపై మక్కువ చూపుతారు- దుర్గారావు, రష్మీ భర్త
ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే : రష్మీ లాంటి క్రీడకారులకు ఆర్థిక సహాయంతో పాటు జావెలిన్ త్రో క్రీడలోని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్టీఆర్ స్టేడియం కోచ్ కోరుతున్నారు. అప్పుడే క్రీడల్లోకి రావాలనే ఆసక్తి యువతలో పెరుగుతుందని అంటున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు మోస్తూనే లక్ష్యం వైపు అడుగులేస్తోంది రష్మీ. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
'అద్వితీయ 2024' - సందడి చేసిన విద్యార్థినులు - వివిధ రంగాల్లో నైపుణ్య ప్రదర్శన