Rakhi Pournami in Telugu States: అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల ప్రేమ అనురాగం, అప్యాయతకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్. తోడపుట్టిన వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కాంక్షిస్తూ తోబుటువైన సోదరి సోదరుని చేతి మనికట్టుకు కట్టే రాఖీ ఎంతో విలువైనది. రాఖీ కట్టే సోదరిని సంతోష పెట్టేలా తోచిన మేరకు కానుకలు ఇస్తుంటారు అన్నదమ్ములు. అంతేగాక కష్ట సుఖాల్లో తోడుంటానని, ఆపదలో ఆదుకుంటానని అభయమిస్తుంటారు. పేగు బంధంతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువుగా గుర్తు చేసేదే రాఖీ పండుగ. నాటికీ, నేటికీ, ఏనాటికైనా ఇదే రక్షాబంధన్ పరమార్థం.
గతంలో దారంతో చేసిన దూది రాఖీలు విభిన్నమైన సైజుల్లో అందుబాటులో ఉండేవి. ఆ తరువాత చైన్ రాఖీలు ఆకట్టుకున్నాయి. రానురానూ కాలానుగుణంగా వివిధ డిజైన్లతో పాటు, దేవుళ్ల ఫొటోలతో రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రాఖీలు కనువిందు చేస్తున్నాయి. వెండి, బంగారం పూసిన ఖరీదైన రాఖీలకు సైతం మంచి డిమాండ్ ఉంది. ప్రతిసారీలాగ కాకుండా ఈసారి విభిన్నంగా ఉండే రాఖీలను తమ సోదరులకు కట్టేందుకు సోదరీమణులు ఉత్సాహం చూపుతున్నారు. అందుకోసం ఖరీదైన రాఖీల కోసం యువతులు, మహిళలు దుకాణాల దగ్గర గంటల తరబడి అన్వేషిస్తున్నారు. దీంతో దుకాణాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది.
కొత్త కొత్త డిజైన్లతో రాఖీలు: విద్యా, ఉద్యోగ రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉండే తమ సోదరుల కోసం కొరియర్, ఆన్ లైన్ మార్గాల్లో అక్కాచెల్లెళ్లు రాఖీలు పంపించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారులకు ఇష్టమైన పండుగల్లో ఒకటి రాఖీ పౌర్ణమి. ఆ రోజు అన్నాచెల్లెళ్లూ, అక్కాతమ్ముళ్లూ చేసే సందడి అంతా ఇంతా కాదు. మరి వారిని సైతం మనసు దోచుకునేలా వివిధ బొమ్మల రూపంలో కొత్త కొత్త డిజైన్లతో రాఖీలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. లైటింగ్ రాఖీలు, మోటుపత్లు, ఛోటా భీమ్, స్పైడర్ మెన్, కార్లు, బైక్లు వంటి రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోదరులకు విభిన్నంగా ఉండే రాఖీలను కొనుగోలు చేసే సోదరీమణులు అదే విధంగా స్వీట్లలోనూ విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇది గమనించిన వ్యాపారులు వారి అభిరుచుకి తగినట్లుగా వివిధ రకాల స్వీట్లు తయారు చేసి దుకాణాల్లో అందుబాటులో ఉంచారు.
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books