Rajahmundry Railway Station Modernization : విజయవావడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం 32 వేల నుంచి 35 వేల మంది ప్రయాణికులు విజయవాడ-విశాఖ-కాకినాడ-భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే 40 ఏళ్ల నాటికి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు చేరుకుంటారని అంచనా.
రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్ ఫాంల పటిష్ఠత పనులు జరుగుతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ భవంతి స్థానంలో మూడంతస్తుల ప్రాంగణం నిర్మించాలని ప్రతిపాదించారు.
ఆధునిక హంగులతో ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించేందుకు పలు దఫాలు అధికారులు చర్చించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ డీఆర్ఎం నరేందర్ పాటిల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను సందర్శించి అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
సానుకూలంగా స్పందించిన డీఆర్ఎం : రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వైపు ట్రాఫిక్ తీవ్రంగా ఉండటంతో తూర్పు వైపు మరింత అభివృద్ధి పనులు చేపట్టే అంశం, రోడ్డు విస్తరణ పనుల్ని డీఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. అనపర్తిలో జన్మభూమి ఎక్స్ ప్రెస్‌కు హాల్టింగ్, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విశాఖ వెళ్లేందుకు రైళ్లు అందుబాటులో లేకపోవడం, మండపేట మండలం కేశవరం వద్ద ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డీఆర్ఎం దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.
రెండు నుంచి నాలుగు - విశాఖ-విజయవాడ రైల్వే ట్రాక్‌ల విస్తరణ - Vijayawada Visakha railway track
రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చుతాం : 2027 గోదావరి పుష్కరాల (Godavari Pushkarams 2027) నాటికి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రూపురేఖలు మార్చుతామని ఎంపీ పురందేశ్వరి తెలిపారు.