Rains In Andhra Pradesh and Telangana : రాష్ట్రంలో పలు చోట్ల వానలు దంచికొట్టాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి ఈరోజు (శనివారం) ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.రాత్రంతా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యాలయం, ప్రభుత్వ గ్రంథాలయం కార్యాలయాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లోని చెరువులు వర్షం నీటితో నిండిపోయాయి. ఈ ఏడాది కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావులలో నీరు సమృద్ధిగా వస్తున్నట్లు రైతులు తెలిపారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో రాయదుర్గం మండలంలో 75.6 మి.మి, కనేకల్ 54.0 మి.మి, డి. హీరేహాల్లో 59.8 మి.మి, బొమ్మనహాల్ 31.4 మి.మి, గుమ్మగట్టలో మండలాల్లో 36.2 మి.మి వర్షపాతం నమోదైంది.
ఆదోనిలో భారీ వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Heavy Rains In Kurnool District
అలాగే నిన్న(శుక్రవారం) కర్నూలు జిల్లా ఆదోనిలో అధిక మోతాదులో వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారులు పూర్తిగా నీటితో నిండాయి. వర్ష ప్రభావానికి వాహనాలన్నీ నిలిచిపోయాయి. వర్ష తీవ్రతకు వాహన, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
శుక్రవారం పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రకృతి ప్రళయం - రాష్ట్రంలో విరిగిపడుతున్న కొండచరియలు - Landslides In Alluri Sitaramaraju
ఆవర్తన ప్రభావంతో శనివారం జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు సైతం జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుపానులు! - నవంబరు వరకు రాష్ట్రానికి గడ్డుకాలం - Storms in the Bay of Bengal