Rains Are Falling Across The State Due To The Fengal Cyclone : నైరుతి బంగాళాఖాతంలో ఫెయింజల్ తుపాను కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురస్తున్నాయి. శుక్రవారం అక్కడక్కడ జల్లులు పడగా అర్ధరాత్రి తర్వాత వర్షం తీవ్రమైంది. ప్రస్తుతం వర్షం నెమ్మదించినా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి, ఆ తర్వాత వసతి గదులకు చేరుకోవడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈదురుగాలులతో చలి అధికమై వణుకుతున్నారు.
వర్షం దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డులో వాహనదారులకు సమస్యలు ఏర్పడకుండా టీటీడీ సిబ్బంది చర్యలు చేపట్టారు. పాపవినాశనం, శ్రీవారి పాదమార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల్లో వర్షం కురుస్తోంది.
తుమ్మలపెంట సముద్రతీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని విడవలూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, జలదంకి, చేజర్ల, కందుకూరులో వర్షం కురుస్తోంది. తుపాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వాయుగుండం కారణంగా శుక్రవారం రాత్రి నుంచి బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రేపల్లె, నగరం, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో వరి నేల వాలింది. తుఫాను హెచ్చరికలతో ముందస్తుగా నూర్పిడి యంత్రాలతో కోత కోసిన రైతులు ధాన్యాన్ని సురక్షితంగా ఉంచుకునేందు పట్టాలు కప్పుతున్నారు. ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడులు పెట్టామని చేతికి వచ్చిన పంట నేల వాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం మరో రెండు రోజులు కొనసాగితే పంట నీటి పాలు అయ్యి పూర్తిగా నష్టం వాటిల్లుతుందని రైతున్నలు వాపోతున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మండల పరిధిలోని తుమ్మలపెంట సముద్ర తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్ర తీరం కొంతమేర కోతకు గురైంది. తీరం వెంబడి ఉన్న బోట్లు, వలలను మత్స్యకారులు సురక్షితమైన ప్రాంతాల్లోకి తరలించారు. సముద్ర తీరంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శుక్రవారం సాయంత్రం నుండి వర్షం కురుస్తుంది. పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాలతో యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నావలు గౌతమి గోదావరి తీరాన గట్టుకే పరిమితమయ్యాయి. ఫెంగల్ తుపాను శనివారం సాయంత్రం లోగా తీరాన్ని దాటుతుందని తుపాను హెచ్చరిక కేంద్రం తెలియజేయడంతో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్ ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో తుపాను - రాష్ట్రంలో భారీ వర్షాలు
జాగ్రత్తలు పాటించాలి: వర్షాల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లోని పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులతో విద్యుత్ స్థంబాలు ఒరిగే ప్రమాదం ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు సూచించారు.
"అలర్ట్" మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటనున్న తీవ్ర వాయుగుండం