Rains Alert in AP : ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది. పలు చోట్ల అక్కడకక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.
ఆ జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు : ద్రోణి ప్రభావంతో ఇవాళ ( మే 17న) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
ఆ జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు : ద్రోణి ప్రభావంతో రేపు ( మే 18న) ఎన్టీఆర్, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక : ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని తెలిపారు.
ఏపీలో వర్షం : గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా బరకాలు కప్పారు. కల్లాల్లో తడిసిపోతుందని ధాన్యాన్ని మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు భారీ వర్షానికి జిల్లాలోని పలు రోడ్లు జలమయ్యాయి. నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో పిడుగుపాటుకు ఆరు మేకలు, రెండు గొర్రెలు మృతిచెందాయి.
రెయిన్ అలర్ట్- నాలుగు రోజుల పాటు కూల్ వెదర్ - Rain Alert In Andhra Pradesh