MASTAN SAI ARRESTED IN DRUGS CASE: గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయి అనే యువకుడిని డ్రగ్స్ కేసులో విజయవాడ సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జూన్ నెలలో విజయవాడలో డ్రగ్స్ పట్టుబడగా నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
ఆ మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు, అప్పట్నుంచి పరారీలో ఉన్న మస్తాన్ సాయి కోసం గాలించారు. అతను గుంటూరు వచ్చినట్లు తెలియటంతో సెబ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. సినీనటుడు రాజ్ తరుణ్, లావణ్యకు డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో మస్తాన్ సాయి పేరు మొదటిసారి వార్తల్లోకెక్కింది. అలాగే మస్తాన్ సాయి లావణ్యను వేధించినట్లు గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ కార్యక్రమం కోసం గుంటూరు వచ్చిన లావణ్యను హోటల్ గదిలో మస్తాన్ సాయి వేధించగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలో సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కొద్ది నెలల క్రితం డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. కానీ అప్పటి నుంచీ పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు.
ఎట్టకేలకు ఇప్పుడు ఏపీ సెబ్ పోలీసులకు చిక్కాడు. సాయి సెల్ ఫోన్లో పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి తండ్రి గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
డ్రగ్ కేసులో హీరో రాజ్ తరుణ్ ప్రేయసి - రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు
మరోవైపు గత కొంతకాలంగా నడుస్తోన్న లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలో మస్తాన్ సాయి పేరు కూడా కీలకంగా మారిన విషయం తెలిసిందే. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని, మస్తాన్ సాయి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని కొద్ది రోజుల క్రితం సినీనటుడు రాజ్‌తరుణ్ ఆరోపించారు. అంతే కాకుండా మస్తాన్ మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాలతో లావణ్య గతంలో పట్టుబడింది.