Proposals to the Center for a National Park in Chittoor District : చిత్తూరు జిల్లాలో గజరాజులు వణికిస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏగుంపు గ్రామాల మీద పడుతుందో, ఎంత పంటలను నాశనం చేస్తుందో తెలియక అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. జిల్లాలో నిత్యం ఏనుగుల సమూహాలు- మనుషుల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంటోంది. ప్రాణనష్టం రెండువైపులా ఉంటోంది. ఈ నేపథ్యంలో గజరాజులను దృష్టిలో ఉంచుకుని బందీపూర్ తరహాలో ఇక్కడా జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని ఇటీవల అటవీశాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందుకు కేంద్రం తోడ్పాటునిస్తే పర్యాటకంగా జిల్లా అభివృద్ధి చెందడంతోపాటు ఏనుగుల సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
రెండు రాష్ట్రాల నుంచి రాకపోకలు : పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో విస్తరించిన కౌండిన్య అభయారణ్యంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన గజరాజులు తరచూ సంచరిస్తుంటాయి. ఇలా వంద వరకు ఏనుగులు రాకపోకలు సాగిస్తుంటాయి. అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం లభించనందున అవి జనావాసాలపై పడుతున్నాయి. రాత్రిళ్లు పంటపొలాల్లోకి వచ్చి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ఎకరాకు రూ.3-6 వేల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. వాటి దెబ్బకు భయపడి పలమనేరు మండలంలోని ముసలిమడుగు తదితర ప్రాంతాల్లో అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించిన ఉదంతాలున్నాయి. గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని జిల్లాకే చెందిన అటవీ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విన్నవించినా ఆయన పట్టించుకోలేదు.
భయం'కరి' విధ్వంసం - తరచూ ప్రమాద ఘంటికలు - 'కుంకీలను పంపించండి'
అందుబాటులో రూ.18 కోట్లు : ప్రస్తుతం బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జిల్లాలో జరుగుతోంది. పలమనేరులో కౌండిన్య అభయారణ్యంలోని భూమిని కొంతవరకు నిర్మాణానికి తీసుకున్నారు. దీంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి అటవీ శాఖకు రూ.18 కోట్ల పరిహారం వచ్చింది. ఈ నిధులను జాతీయ పార్క్ ఏర్పాటుకు వెచ్చించవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిందించాల్సిన ఆవశ్యకత ఉంది.
ఆహార కొరత తీరినట్లే : జాతీయ పార్క్ నెలకొల్పాలని అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే గజరాజులకు అవసరమైన ఆహారం, నీరు అడవిలోనే అందించవచ్చు. తద్వారా అవి అభయారణ్యంలోనే ఉండటంతో పంటలకు వాటిల్లే నష్టం తగ్గుతుంది. అటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ తలెత్తదు.
అనుకూల అంశాలు : కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని గుండ్లపేట తాలుకాలో పులుల సంఖ్యను పరిగణనలోనికి తీసుకుని బందీపూర్ జాతీయ పార్క్ నెలకొల్పారు. ఈ ప్రాంతంలో ఏనుగులు, అడవి దున్నలు తదితర జంతుజాలం ఉంది. ఇక్కడ జంగిల్ సఫారీ అందుబాటులోకి తీసుకువచ్చారు. గతేడాది దాదాపు 1.40 లక్షలమంది సందర్శించడంతో రూ.13.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదేవిధంగా కౌండిన్య అభయారణ్యంలోనూ సఫారీ ఏర్పాటు చేస్తే రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది.
అభయారణ్యం | |
విస్తీర్ణం | 358 చ.కి.మీ. |
ఏర్పాటు | 1990 |
ఏనుగుల సంఖ్య | 100 |
'కుంకీ ఏనుగుల రాక, నిధుల అందుబాటులో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.' - చైతన్య కుమార్ రెడ్డి, పూర్వపు డీఎఫ్‌వో