Problems In APSRTC Buses: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ బస్సు ధగధగలాడుతుంటే, జనం బస్సు, చక్రాలు ఊడిపోయి, అద్దాలు పగిలిపోయి, డొక్కుడొక్కైపోయింది. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌లో సేదతీరిన జగన్ తన ఎన్నికల యాత్ర కోసం ఆర్టీసీతో ఈ బస్సు కొనిపించారు. కానీ, రోజూ 40 లక్షల మంది తిరిగే ప్రయాణికుల్ని మాత్రం, ఈ తుక్కుడొక్కు బస్సుల్లో తిప్పుతున్నారు.
సీఎం కోసం ఆర్టీసీ వద్ద ఎప్పట్నుంచో రెండు బుల్లెట్ ఫ్రూఫ్ బస్సులున్నాయి! పేదలపక్షపాతినిని చెప్పుకునే జగన్‌కు, వాటిలో వెళ్లడానికి మనస్కరించలేదేమోగానీ 20 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఆర్టీసీ ద్వారా కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయించారు! ఎప్పుడో ఒకసారి బయటికొచ్చే తాను హాయిగా వెళ్లాలి, జనమేమో బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాలనే స్వార్థం జగన్‌ది.
సీఎం జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు - ప్రయాణికులకు డొక్కు బస్సులు
ఇటీవలే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం బస్టాండ్‌లో బ్రేక్‌లు పడక ఓ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విజయవాడ బస్టాండ్‌లో గతేడాది అలాంటి బస్సే ప్రయాణికుల రక్తం కళ్లజూసి ప్రాణాలు తీసింది! స్టీరింగ్, బ్రేకులు, గేర్ బాక్సు పట్టేయడం, చక్రాలు ఊడిపోయి బస్సు నుంచి వేరవడం వంటి సమస్యలతో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు మళ్లీ బస్ డిపోకి చేరే వరకూ నమ్మకాలు ఉండవు. వాటికి మరమ్మతులు కూడా చేయలేమని మెకానిక్‌లు చేతులెత్తేస్తున్నా, అధికారులు ఒత్తిడి చేసిఏదో ఒకలా రోడ్డెక్కిస్తున్నారు.
డొక్కు బస్సుల ప్రయాణానికి 3 సార్లు ఛార్జీల పెంపు: గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదన్నట్లు ఆ డొక్కు బస్సుల ప్రయాణానికే జగన్ 3 సార్లు ఛార్జీలు పెంచేశారు! టైర్లు, విడిభాగాల ధరలు పెరిగాయని 2019 డిసెంబరులో ఒకసారి, 2022 ఏప్రిల్‌లో డీజిల్ సెస్ పేరిట రెండోసారి, ఆ తర్వాత మూడు నెలలకే మరోసారి డీజిల్ సెస్ అంటూ ఛార్జీలు బాదారు. మొత్తంగా మూడుసార్లు కలిపి ఏటా 2 వేల కోట్ల రూపాయల చొప్పున ప్రయాణికుల నుంచి అదనంగా పిండుకుంటున్నారు జగన్. కానీ కొత్త బస్సులు కొని. ప్రయాణికుల కష్టాలు తీర్చండని ఏనాడూ చెప్పలేదు. పేదలపై జగన్ మాటల్లో చూపించే ప్రేమ నిజమైతే వారిని ఇలా డొక్కుబస్సులకు వదిలేస్తారా?
భద్రతా ప్రమాణాలపై అప్పట్లో ఉపన్యాసం: 2019 నవంబర్‌లో సీఎం హోదాలో ఆర్టీసీపై జగన్ సమీక్షించిప్పుడు 12 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన బస్సులు 3 వేల 600 ఉన్నాయి. వాటిని మార్చితేనే ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు పాటించిట్లని జగన్ అప్పట్లో ఉపన్యాసమిచ్చారు! మరి చేసిందేంటి? ఆర్టీసీలో 12 లక్షల కిలోమీటర్ల కు పైగా తిరిగిన బస్సుల సంఖ్య 4 వేల 815కు పెరిగింది. ప్రతీనెలా అలాంటి కాలంచెల్లినబస్సుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో 10 వేల 654 బస్సులు ఉంటే అందులో సంస్థ సొంత బస్సులు 8,369. 10 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన బస్సులు 5 వేల 942. ఆర్టీసీ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో 10 లక్షల కిలోమీటర్లు దాటితే, వాటి స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. అలాగే 10 లక్షల కిలోమీటర్ల తిరిగిన బస్సులను పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెగులు, సిటీ సర్వీసులుగా మార్పుచేసి 12 లక్షల కిలోమీటర్ల వరకూ నడపాలి.
ఆ తర్వాత వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. కానీ అయిదేళ్లుగా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోళ్లేలేవు. 15 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగేసిన బస్సులు 2 వేల 119 ఉంటే, అందులో 1,809 బస్సులు పల్లెవెలుగులు సర్వీసులే. విజయవాడ, విశాఖ నగరాల్లోని 134 సిటీ సర్వీసు బస్సులు 15 లక్షల కిలోమీటర్లపైనే తిరిగాయి. దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా 105 సర్వీసులు 15 లక్షల కిలోమీటర్లు దాటేసినా ఇంకా వాటిలోనే ప్రయాణికుల్ని తిప్పుతున్నారు. ఇక ఘాట్‌రోడ్ సర్వీసులనైతే 7 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగితే మార్చేయాలి! కానీ, తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డులోనూ కాలం చెల్లిన బస్సులను నడుపుతూ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
20 కోట్లతో 2 బుల్లెట్‌ప్రూఫ్ బస్సులు - భద్రత పేరుతో సీఎం జగన్ దుబారా
బస్సుల కొనుగోళ్లకు నిధులు ఉండటం లేదు: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని, వారికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోదంటూ జగన్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటోంది. ఓ చేత్తో జీతాలు ఇస్తునే మరో చేత్తో ఆర్టీసీ రాబడిలో 25 శాతం లాగేసుకుంటోంది. ఆర్టీసీకి నెలకు సగటున 600 కోట్ల రూపాయల రాబడి వస్తుంటే, అందులో 125 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన ఖజానాలో జమచేయించుకుంటోంది. ఫలితంగా ఆర్టీసీ వద్ద కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధులు ఉండటంలేదు.
అక్కడ అధునాతన బస్సులు: మన పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక ఆర్టీసీలు అధునాతన బస్సులతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటి ముందు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తేలిపోతున్నాయి. 1,500 డీజిల్ బస్సులు, వెయ్యి విద్యుత్ బస్సులుకొంటామని 200 పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చి వినియోగిస్తామని, ప్రభుత్వం ఏడాదిగా చెబుతూనే ఉంది. 1,500 బస్సుల కొనుగోలు ప్రక్రియ చేపట్టినా వీటిలో 200 వరకూ మాత్రమే ఇప్పటి వరకూ వచ్చాయంటే పేదల ప్రయాణంపై జగన్‌కు ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది.
పాత బస్సులు, మూడుసార్లు ఛార్జీల మోత - ఆర్టీసీ ప్రయాణికుల జేబుకు చిల్లు