Prakasam Barrage New Counterweight works Completed : విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌెంటర్ వెయిట్లను విజయవంతంగా అధికారులు అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు చేస్తోన్నారు. కేవలం రెండు రోజుల్లోనే గేట్ల మరమ్మతు పనులను అధికారులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కులనీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి సిబ్బంది గేట్లను అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.
ఇక పడవల తొలగింపు పై దృష్టి : కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారుల దృష్టి సారించారు. ఆధునాతన విధానంలో కౌంటర్ వెయిట్లను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ తయారు చేసింది. భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కోటి 17 టన్నుల చొప్పున బరువున్న కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సహాయంతో రెండు గేట్ల వద్ద ఏర్పాటు చేసింది. రికార్డు సమయంలో కీలక పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి గేట్ల మరమ్మతులు, పడవల తొలగింపు ప్రక్రియను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రమానాయుడు పరిశీలించారు.
"పడవలు ఢీకొని 2 కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన కౌంటర్ వెయిట్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేశాం. కొత్త కౌంటర్ వెయిట్లను కాంక్రీట్‌తో కాకుండా స్టీల్‌తో చేశాం.కేవలం రెండ్రోజుల్లోనే కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పూర్తి చేశాం. అలాగే కౌంటర్ వెయిట్లలో కాంక్రీట్ నింపే పనులు రేపు చేస్తాం. భవిష్యత్తులో బ్యారేజ్ వైపు పడవలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.ఉద్దేశపూర్వకంగా పడవలు వదిలితే మాత్రం కఠిన చర్యలు తప్పవు." - నిమ్మల రమానాయుడు, జలవనరులశాఖ మంత్రి
అలాంటి లోపాలకు తావివ్వకుండా : పడవలు మామాలు స్థితిలోకి రాకపోతే గ్యాస్ కట్టర్లతో కోసి ముక్కలైన భాగాలకు లంగర్లు కట్టి వెనక్కి లాగి తొలగించేలా ఇంజినీర్లు కార్యాచరణను అమలు చేస్తున్నారు. అవి వెనక్కి తీసే క్రమంలో ఎక్కడా అదుపు తప్పి వెనక్కి రాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మధ్య వరకు వెళ్లి అదుపు తప్పి మళ్లీ ముందుకు వచ్చి గేట్లను ఢీకొంటే అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కడా అలాంటి లోపాలకు తావివ్వకుండా నిపుణులైన ఇంజినీర్లు మార్గదర్శకం చేస్తూ పనులు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, డ్యాం సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
పనికిరాని విధంగా ధ్వంసం అయ్యాయి : ఈ నెల 1న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన 3 పడవలు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏమాత్రం పనికిరాని విధంగా ధ్వంసం అయ్యాయి. గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69 గేట్ వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. భారీ కట్టర్లు, యంత్రాలతో దెబ్బతిన్న దానిని రెండుగా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న వీటిని భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకు దించి ప్రవాహాన్ని నిలిపివేశారు.
శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease