Veerabhadra Exports Industry Closed : వైఎస్సార్సీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరిట రెండో యూనిట్ ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉందన్న ధీమాతో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగించింది.
ప్రభుత్వం మారడంతో నిర్వహించిన తనిఖీల్లో ఈ పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించి సరిదిద్దుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) నోటీసులు ఇచ్చింది. అయినా వాటిని లెక్కచేయలేదు. దీంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్ ఆర్డర్) ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో గతంలో ద్వారంపూడి కుటుంబానికే చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలోనూ ఉల్లంఘనలు గుర్తించి ఈ సంవత్సరం ఆగస్టు 6న మూసివేయించారు.
అడుగడుగునా ఉల్లంఘనలే : 25 టన్నుల సామర్థ్యంతో వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ రొయ్యల శుద్ధి యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో 300 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ 1.5 టన్నుల అమ్మోనియా నిల్వ ట్యాంకు ఉంది. కానీ లీకేజీలు, ప్రమాదాలు గుర్తించే హెచ్చరికల వ్యవస్థ లేదు. వ్యర్థాల శుద్ధికేంద్రం ఉన్నా నిరంతరం పనిచేయడంలేదు. మరోవైపు అనుమతి తీసుకోకుండానే 20 టన్నుల ఐస్ ట్యూబ్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ లోపాలన్నీ సరిదిద్దుకోవాలని పీసీబీ అధికారులు జులై 3న నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత తనిఖీలు చేసినా స్పందించలేదు. దీంతో మూసివేతకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
ద్వారంపూడి అడ్డాలో రేషన్ మాఫియా - సూత్రధారులు, పాత్రధారులపై ఫోకస్ - RATION MAFIA IN KAKINADA