Vijayawada Police Traced Girl Missing Case : ఓ తల్లి తొమ్మిది నెలల కన్నీటి శోకానికి విముక్తి కలిగింది. అదృశ్యమైన కుమార్తె ఆచూకీ లభ్యమవటంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది. గత నెల 22న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan on Girl Missing Case in Vijayawada : తన చిన్న కుమార్తె విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోందని, అదే కళాశాలలో చదువుతున్న సీనియర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయింది. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ మాచవరం సీఐ గుణరాముకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వారు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి ఆ యువకుడు యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక నగలు, ఫోన్లు అమ్మేశారు. ఆ తర్వాత కేరళ, ముంబై, దిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకు చేరారు. అక్కడ హోటల్లో అతను పనికి కుదిరాడు.
నేడు విజయవాడకు తీసుకొచ్చే అవకాశం : ఆ యువకుడు అమ్మాయిని ఇతరులతో మాట్లాడించే వాడు కాదు. ఓరోజు అతను లేని సమయంలో అతని ఫోన్ నుంచి తన అక్కకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఓ బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించారు. సోమవారం రాత్రి అక్కడ ఇద్దరినీ తమ ఆధీనంలోకి తీసుకుని జమ్మూ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి నేడు విమానంలో విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉంది.
Vijayawada Girl Missing Case Updates : ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన తీరును ఆయన వివరించారు. ‘కిడ్నాప్ చేశారా?’ అని పవన్ సీపీని ప్రశ్నించగా కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామని చెప్పారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సీపీ రామకృష్ణను పవన్ అభినందించారు. మరోవైపు తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత యువతి తల్లి విజయవాడ పోలీసు కార్యాలయంలో సీపీ రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
యువతి అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు- పవన్ ఆదేశించిన 48గంటల్లో వీడిన మిస్టరీ - Woman Missing Case