Police Checking Vehicles due to Elections : రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలింపుపై అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు చూపని నగదు, బంగారాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు.
వాహన తనిఖీల్లో పట్టుబడిన రూ.కోటి 31లక్షలు- ముగ్గురు అరెస్టు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వేగవరం బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం నుంచి తాడువాయి వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ 7 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబాస్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న నగదు మెుత్తాన్ని జిల్లా ట్రెజరీకి పంపించడం జరుగుతుంది. ఎవరైనా 50 వేలకు మించి నగదును తీసుకెళ్తే సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. లేకపోతే నగదు స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.
Code Violations in AP : అలాగే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో ఎంత డబ్బును స్వాధీనం చేసిన విషయాలను జిల్లాకలెక్టర్ నాగలక్ష్మి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, ఎన్నికల నోటిషికేషన్ వెలుబడినప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయల విలువచేసే నగదు, మద్యం, వివిధ రకాల వస్తువులను సీజ్‌చేశాం. వీటిలో రూ. 11.20 లక్షల నగదు, రూ. 35.03 లక్షల విలువైన మద్యం, రూ. 20.83లక్షల విలువైన డ్రగ్స్, రూ. 2 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 30.02 లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల వేళ వైసీపీ కుట్రలు బట్టబయలు - ఓటర్లకు పంచనున్న చీరలు పట్టివేత
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు 15 మంది వలంటీర్లను తొలగించామని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నాకు. అలాగే ఇద్దరు రేషన్ డీలర్లపైనా కేసులు పెట్టామని, మరో ఇద్దరు రేషన్ డీలర్లను తొలగించామని తెలిపారు. అదేవిధంగా రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు 11కేసులు నమోదు చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన దగ్గరనుంచి నేటివరకు వివిధ మార్గాల్లో 280 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 276 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిజిల్ ద్వారా 121, కాల్ సెంటర్‌కు 41, ఎన్‌జిఎస్‌పి పోర్టల్ ద్వారా 66, మీడియా ద్వారా 50, సోషల్ మీడియా ద్వారా 2 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసుల వైపు నుంచి తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే అంశంపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈటీవీతో మాట్లాడారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తాము. ఇప్పటికే చెక్ పోస్టుల ద్వారా ఎక్కడికక్కడ నిఘాను ఉద్ధృతం చేశాము. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది కచ్చితంగా పాటించాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాం. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల వైపు నుండి భద్రత ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు దఫాలుగా సిబ్బందికి శిక్షణ పూర్తి చేశాము. చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో జిల్లా వ్యాప్తంగా 1 కోటి 64 లక్షల రూపాయలు విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నాము. అలాగే గతంలో నేరచరిత్ర ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నాము. - వకుల్ జిందాల్, బాపట్ల జిల్లా ఎస్పీ
ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వాకం - తక్కువ ఉన్నా ఎక్కువ చూపి నగదు స్వాధీనం