People Suffering to Dumping Yard in Ongole : చెత్తను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్రప్రభుత్వ సహకారంతో ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. అయినోళ్లకు టెండర్లు కట్టబెట్టింది. డబ్బులు తీసుకున్న ప్రైవేటు సంస్థ చెత్తను శుభ్రపరచకుండానే సర్దేసుకుని వెళ్లిపోయింది. డంపింగ్ యార్డు క్లీనింగ్ ప్రాజెక్టు అటకెక్కి చెత్తంతా పేరుకుపోయింది. భరించలేని కంపు, ఈగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గతంలో ఎంత ఉందో ఇప్పుడూ అంతే : ఒంగోలులో ఉత్పత్తయ్యే చెత్తను గుత్తిరెడ్డివారిపాలెం సమీపాన ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. పొడిచెత్త, తడిచెత్త, ప్లాస్టిక్, ఇనుము వ్యర్థాలను వేరు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు మట్టిని ఎరువుగా వాడటం, ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుదుత్పత్తి కేంద్రానికి తరలించడం కోసం కేంద్రప్రభుత్వం స్వఛ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టును మంజూరు చేసింది. గుత్తేదారు 5కోట్ల రూపాయలతో పనులు దక్కించుకున్నారు. 65 వేల మెట్రిక్ టన్నుల చెత్తను శుభ్రపరిచి అప్పగించాలి. కానీ నామమాత్రంగానే పనులు చేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. పని పూర్తయిందని చెప్పి యంత్రాలను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో గతంలో ఎంత చెత్త ఉండేదో ఇప్పుడూ అంతే ఉంది.
భరించలేని దుర్గంధం, ఈగలు, పురుగులు : డంపింగ్ యార్డులో చెత్తకుప్ప కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతానికి దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వలున్నాయి. భరించలేని దుర్గంధం, ఈగలు, పురుగులు పట్టి చుట్టుపక్కల గ్రామాలతోపాటు అటువైపు రాకపోకలు సాగించేవారికి అసౌకర్యాన్ని కల్గిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచన మేరకు కాలుష్యకారకమైన చెత్త నుంచి సంపద సృష్టించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని నీరుగార్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును శుభ్రపరుస్తామని కోట్ల రూపాయలు కొట్టేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
"డంపింగ్ యార్ట్ ఇక్కడ పెట్టినప్పుటి నుంచి భరించలేని వాసన, పొగ వస్తోంది. దాని వాళ్ల ఎటువంటి రోగాలు వస్తాయో అని భయంగా ఉంది. అసలు ఇటువైపు రావాలంటేనే భయం వేస్తొంది. వర్షం పడితే వాహనాదారుల ఇబ్బందులు మరింత అధ్వానంగా ఉంటుంది. డంపింగ్ యార్డును శుభ్రపరుస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు అలాగే వదిలేశారు. పని పూర్తయిందని చెప్పి యంత్రాలను తీసుకుని వెళ్లిపోయారు." - స్థానికులు
డంపింగ్ యార్డ్‌లో చెలరేగిన మంటలు - పొగతో తీవ్ర ఇబ్బంది పడిన స్థానికులు - Fire in Dumping Yard