People Suffering No Street Lights in YCP Government : పలు అంశాల్లో దేశంలోనే ఒకప్పుడు అగ్రస్థానంలో వెలిగిపోయిన ఏపీ ఇప్పుడు జగన్ జమానాలో చీకట్లమయమైంది. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అక్కసు తీర్చుకోవాలన్న ఆయన ధోరణి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఎల్‌ఈడీ (Light Emitting Diode) వీధి దీపాలతో ఐదు సంవత్సరాల క్రితం వరకు పాల నురగలా తలతలలాడిన పల్లెలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, కక్ష సాధింపు చర్యలతో చీకట్లలో మగ్గిపోతున్నాయి. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే గ్రామీణులు బెంబేలెత్తిపోతున్నారు.
వీధి లైట్ల బిల్లులకు డబ్బుల్లేవ్! 100 కోట్లకుపైగా బకాయిలతో చీకట్లో పలు నగరపంచాయితీలు
టీడీపీ హయాంలో వీధి దీపాలు ఏర్పాటు : రాత్రిపూట ఈసురోమంటూ కనిపించిన పల్లెల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఈఎల్‌డీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వెలుగులు పూయించింది. లక్ష, రెండు లక్షలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 24.88 లక్షల దీపాలను ఈఈఎస్‌ఎల్ (Energy Efficiency Services Limited), నెర్డ్‌కాప్ ద్వారా ఏర్పాటు చేయించింది. ఈ విధానంతో గ్రామ పంచాయతీలకు బహుళ ప్రయోజనం చేకూరింది. విద్యుత్ వినియోగ ఛార్జీలు తగ్గాయి. చిరకాలంగా ఎదుర్కొంటున్న వీధి దీపాల సమస్యకు సరైన పరిష్కారం లభించింది. నిర్వహణ బాధ్యతను ఈఈఎస్‌ఎల్, నెర్డ్‌కాప్‌కు అప్పగించడంతో పంచాయతీలకు భారం తగ్గింది. కేంద్రీయ నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థ- సీసీఎంఎస్ ఆధ్వర్యంలో 41,737 ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా వీధిలైట్లపై పర్యవేక్షణ, నియంత్రణ సులువైంది. అన్ని విధాలా ఉపయోగకరమైన ఎల్‌ఈడీ ప్రాజెక్టును జగన్ సర్కారు దెబ్బతీసింది.
గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం పంచాయతీల నుంచి తన వాటా నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. వీధి దీపాల నిర్వహణ సరిగా లేదంటూ ఈఈఎస్‌ఎల్, నెర్డ్‌కాప్‌లకు తాఖీదులు పంపింది. చంద్రకాంతి పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టును జగనన్న పల్లెవెలుగుగా మార్చేసింది. నిర్వహణ బాధ్యతల నుంచి ఆ సంస్థలను తప్పించింది. 2021 మార్చిలో గ్రామ సచివాలయాలకు నిర్వహణను అప్పగించి పంచాయతీ కార్యదర్శులనే బాధ్యులను చేసింది. గడువుకి ముందే ఈఈఎస్‌ఎల్, నెర్డ్‌కాప్‌తో ఒప్పందం తెంచుకుంది. దీంతో న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని ఎల్‌ఈడీ వీధిదీపాల ప్రాజెక్టు నిర్వహణలో ఆ రెండు సంస్థల పాత్రను నామమాత్రం చేసింది.
పవర్‌కట్.. కురుపాంలో మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో చికిత్స
గ్రామాల్లో అలుముకున్న చీకట్లు : ఎంతో అద్భుతంగా అమలైన ప్రాజెక్టుని ప్రభుత్వం నీరుగార్చడంతో గ్రామాల్లో మళ్లీ చీకట్లు అలుముకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 24.88 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాల్లో ఇప్పుడు 12 లక్షలు కూడా సరిగా వెలగడం లేదు. ఎల్‌ఈడీ బల్బులు, విడి భాగాలను సైతం సరఫరా చేస్తామని ముందుకొచ్చిన ఏపీఈఈడీసీ తర్వాత చేతులెత్తేసింది. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించింది. దీంతో వీధి దీపాల నిర్వహణ జగన్ పాలనలో అధ్వానంగా మారింది. పాత బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఈఈఎస్‌ఎల్, నెర్డ్‌కాప్ సంస్థలు జోక్యం చేసుకోవడం లేదు. గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పాడైపోయిన ఎల్‌ఈడీ బల్బుల స్థానంలో కొత్త వాటిని బిగించడం లేదు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచులు కూడా కొత్త ఎల్‌ఈడీ బల్బుల కోసం సొంత డబ్బును ఖర్చు చేయడం లేదు.
వైసీపీ హయాంలో వ్యాపారులకు రక్షణ లేదు- ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పరామర్శించిన టీడీపీ నేతలు
జగన్ ప్రభుత్వం నిధుల మళ్లింపు: కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల నుంచి జగన్ సర్కార్ ఇప్పటివరకు దాదాపు రూ.1,800 కోట్లను విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించింది. వీటిపై ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు చెప్పడం లేదు. పంచాయతీల ఖాతాల్లోని ఈ నిధులను ప్రభుత్వం మళ్లించినా బకాయిలు చెల్లించాలంటూ డిస్కాంలు గ్రామ సచివాలయాలకు నోటీసులు ఇస్తూనే ఉన్నాయి. విద్యుత్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలన్న సర్పంచుల విజ్ఞప్తులను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. పంచాయతీలు చెల్లించాల్సిన బకాయిలు ఎంత? ఇప్పటివరకు ఎంత వసూలు అయింది? అన్న వివరాలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డిస్కంలకు సూచించినా స్పందన కరవైంది.
వీధి దీపాలూ వేయని మీకెందుకు రాజకీయాలు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు