People Suffering Due to Damaged Roads in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కీలకమైన ఆముదాలవలస-శ్రీకాకుళం రహదారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. రోడ్డుపై గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం ప్రమాదాల బారిన పడి ఎంతోమంది వాహనదారులు ఆసుపత్రి పాలవుతున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు మరమ్మతులు కూడా చేయలేదని స్థానికులు చెబుతున్నారు. నూతన ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవేమి రోడ్లు బాబోయ్- ఏలూరు జిల్లాలో చుక్కలు చూపిస్తున్న రహదారులు - Damaged Roads in Eluru District
గోతులతో అధ్వానంగా రహదారి : ఆముదాలవలస-శ్రీకాకుళం రహదారి రెండు పట్టణాలకు ఎంతో కీలకమైంది. ఈ రోడ్డు మీదుగా వేలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. జిల్లాలో ప్రధానమైన రైల్వే స్టేషన్ కూడా ఈ రహదారికే అనుసంధానించబడి ఉంది. దీని అభివృద్ధి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10.4 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారికి 42 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభించింది. అయితే 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. గుత్తేదారుకు బిల్లులు చెల్లించడం ఆలస్యం కావడంతో కేవలం 12 కోట్ల రూపాయల పనులు మాత్రమే చేసి ఆపేశారు. అప్పటినుంచి ఏళ్లు గడుస్తున్నా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. మధ్యలోనే వదిలేసిన పనులుతో రహదారి గోతులతో అధ్వానంగా మారింది. దీంతో ప్రయాణికులు రాకపోకలు చేసేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు.
" గత ఐదేళ్లుగా ఈ రోడ్డు ఇలానే ఉంది. ఏ మాత్రం మార్పు చెందలేదు. రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారి వెంబడి రోజు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతున్నారు. గత ప్రభుత్వం ఎలానో దృష్టి పెట్టలేదు. ఈ ప్రభుత్వమైన రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం"_ స్థానికులు, శ్రీకాకుళం
త్వరలోనే పనులు ప్రారంభం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ గుత్తేదారుతో సంప్రదింపులు జరిపి సకాలంలో బిల్లులు అందేలా చేస్తామని హామీ ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి.
పల్లె రోడ్ల గుంతలు పూడ్చడానికే రూ.1121 కోట్లు - ప్రభుత్వానికి ఇంజినీర్ల నివేదిక - Damaged Roads in AP