Pensioners Facing Problems in Andhra Pradesh: పింఛన్ పంపిణీలో ప్రభుత్వ కుట్రలకు అవ్వాతాతలు అల్లాడిపోతున్నారు. మలమలమాడిపోయే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వ్దద విలవిల్లాడుతున్నారు. ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పండుటాకుల్ని ప్రభుత్వం అవస్థలపాలు చేస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగులపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. పింఛన్ డబ్బులు ఇంటివద్దకు తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా మండుటెండలో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పుతోంది. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ డబ్బుల కోసం అష్టకష్టాలు పడేలా చేస్తోంది. ఉదయం నుంచే పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. విజయవాడలో ఫించనుదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వృద్ధులను పొట్టన పెట్టుకుంటారా?- పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరు దుర్మార్గం: షర్మిల
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని స్టేట్‌బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారుల అవస్థలు పడుతున్నారు. నందిగామలో ఓ వైపు భానుడు భగభగ మండుతుంటే మరోవైపు పెన్షన్ కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బంది పడుతున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఫించన్‌దారులు అవస్థలు కొనసాగుతున్నాయి. ఎస్బీఐతో పాటు సేవా కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వృద్ధులు నానా తిప్పలు పడి బ్యాంకుల వద్ద బారులు తీరారు. గంటల కొద్ది క్యూలో నిలబడినా చివరకు ఈ-KYC కాలేదంటూ కొందరికి, పెన్షన్ సొమ్ము జమ కాలేదని మరికొందరిని వెనక్కు పంపుతున్నారు. మరికొందరికి వేలి ముద్రలు పడటం లేదని చెబుతుండటంతో మండుటెండలో వృద్ధులు నీరశించిపోతున్నారు. బ్యాంకుల వద్ద క్యూలో నిలబడినా చివరకు పెన్షన్ అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకు ఖాతాల్లేకుండానే పింఛన్ జమ ఎలా ? - సచివాలయానికి వెళ్లిన వారికి వింత అనుభవాలు
కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కాట్రేనుకోన, ఐ.పోలవరం మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో ప్రభుత్వ విధానాలతో అవ్వతాతలకు అవస్థలు తప్పడంలేదు. ఐ.పోలవరం మండలం పరిధిలోని బైరపాలెం, తీర్ధాలమొండి, గోగుల్లంక, భైరవ లంక గ్రామానికి చెందిన లబ్ధిదారులు వరుసగా రెండోరోజూ నానా తిప్పలు పడుతూ 20 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు వద్దకు వచ్చారు. కాట్రేనికోన మండలం పరిధిలోని బలుసుతిప్ప, మగసానితిప్ప గ్రామానికి చెందిన లబ్ధిదారులు పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల వద్ద కనీసం సదుపాయాలు లేక ఎండలోనే నిలబడి పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
పింఛన్ దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్ సర్కార్ - ఇంటి వద్దనే ఇవ్వాలని వేడుకుంటున్న వృద్ధులు -
ప్రకాశం జిల్లా ఒంగోలులోని బస్టాండ్ సెంటర్ వద్ద యూనియన్ బ్యాంకు వద్దకు పింఛన్‌దారులు తొమ్మిదింటికి చేరుకున్నారు. బ్యాంకులకు డబ్బులు పడలేదంటున్నారని పండుటాకులు వాపోతున్నారు. బ్యాంక్ అకౌంట్లో పరిమితి సొమ్ము లేకపోవడంతో పింఛన్ నగదు వేసిన డబ్బుల నుంచి 1000 రూపాయలు కటింగ్ చేసుకుంటున్నారని పింఛన్‌దారులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరిగి వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పింఛను కోసం పాస్ పుస్తకాలు పట్టుకొని బ్యాంకులోని కౌంటర్ల వద్ద వేచి చూస్తున్నారు. బ్యాంకులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో బ్యాంకు లేకపోవడంతో పట్టణానికి వచ్చి నానాఅవస్థలు పడుతున్నారు.
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ - Pension Distribution