Pension Distribution in Andhra Pradesh: ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎంత వీలైతే అంత మేరకు అధికారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీలో సీఎస్‌తో పాటు అధికార యంత్రాంగం చేసిన తప్పుడు నిర్ణయాలకు, 32 మంది మరణించారు. అయినా అధికారులు కళ్లు తెరిచినట్లు కనబడటం లేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మే నెలకి సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మే మొదటి వారానికి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఠారెత్తిస్తున్న ఎండలకి, వేడిగాలులకి యువకులే బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ఇంత భీకరంగా ఉన్న ఎండల్లో పండుటాకులను రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోమంటే వారి పరిస్థితేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ సాధ్యమేనని మెజారిటీ జిల్లా కలెక్టర్లు చెబుతున్నప్పుడు, మీకేంటి బాధని సీఎస్‌ని నిలదీస్తున్నారు. ఏప్రిల్‌లో పింఛన్ల కోసం మండుటెండల్లో సచివాలయాలకు వెళ్లిన వృద్ధుల్లో 32 మంది మరణించినా మీ వైఖరి మారదా అని అడుగుతున్నారు. మే నెల్లో కూడా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయరా? ఇదేనా మానవత్వం? అని ప్రజలు నిలదీస్తున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్న సీఎస్ ఇవేవీ పట్టించుకోకుండా, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, నెపాన్ని విపక్షాల పైకి నెట్టేసి, వైసీపీ ప్రభుత్వానికి మేలు చేయాలన్న తలంపులోనే ఉన్నారు. యంత్రాంగం మొత్తాన్ని నడిపే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయి ఉండి కూడా జవహర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సెర్స్ సీఈవో మురళీధర్‌రెడ్డిల ప్రభావంలోనే ఉండిపోతారా? అందులో నుంచి బయటపడరా? వృద్ధులను సచివాలయాలకు రప్పించాలనే ఆలోచనకే ఈసారీ కూడా వంత పాడతారా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిపేయడమేంటి: పింఛన్లు ఇంటింటికీ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు. వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని మాత్రమే ఈసీ చెప్పింది. ఇప్పుడున్న వాలంటీర్లలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలేనన్నది బహిరంగ రహస్యం. వైసీపీ కార్యక్రమాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్న ఉదాహరణలు కోకొల్లలు. దీంతో ప్రభుత్వ పథకాల్ని వారి ద్వారా పంపిణీ చేస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవన్న ఉద్దేశంతోనే వారిని దూరంగా పెట్టాలని ఈసీ చెప్పింది. ఈసీ ఆదేశాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఏకంగా ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిపేయడమేంటి? అది ఈసీ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పిట్టు కాదా?
మండుటెండల్లో వృద్ధుల్ని, దివ్యాంగులను, అభాగ్యులను సచివాలయాల వద్దకు రప్పించి, దానికి కారణం విపక్షాలే అనే భావన ప్రజల్లో కల్పించి, తద్వారా అధికార పార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశమే ఇందులో కనిపిస్తోందన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎస్ పైనే ఉంది. అధికారుల నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ నాయకులు ఎలా పేట్రేగిపోయారో, వృద్ధుల్ని ఎంతగా ఇబ్బందులు పెట్టారో చూసిన తర్వాతైనా వారి తీరు మారాలి కదా! ఎలక్షన్ కమిషన్ అయినా ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి కదా? అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఒకటో తేదీ వస్తోంది - ఈసారైనా ఇంటి వద్దే పింఛన్లు ఇస్తారా ? - Pension Distribution Issue
1.35 లక్షలమంది సచివాలయ సిబ్బంది: రాష్ట్రంలోని 1.35 లక్షలమంది సచివాలయ సిబ్బంది ద్వారా రెండు మూడు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా, జవహర్‌రెడ్డి ఆ నిర్ణయం తీసుకోకపోవడం, మరో నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ జిల్లా కలెక్టర్లతో సమీక్షించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేమీ లేవు. ఎన్నికల వేళ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించాయి. నిత్యావసర సరకులు, పింఛన్ల పంపిణీ వంటి అత్యవసర పనులే జరుగుతున్నాయి. అందుబాటులో కావలసినంత మానవ వనరులున్నాయి.
మరి ఇలాంటి సమయంలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటి? రాష్ట్రంలో మొత్తం పింఛనుదారులు 65.95 లక్షలమంది. ఒక్కో సచివాలయ పరిధిలో పంచాల్సిన పింఛన్లు సగటున 439. ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సినవి 49 మాత్రమే. సచివాలయ పరిధి 3-4 కిలోమీటర్లు. ఇంటింటికీ పింఛన్ పంపిణీకి పట్టే సమయం మహా అయితే రెండు నుంచి మూడు రోజులు మాత్రమే. ఇది చాలా సింపుల్ లెక్క కదా? ఇంత తేలిగ్గా పూర్తి చేయగలగే ప్రక్రియను ఎందుకు అంతగా సంక్షిష్టం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఈ మాత్రం స్పృహ, ఆలోచన ఎందుకు లేవు: ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమవుతారన్న ఉద్దేశంతో, ఎప్పుడో గతించిన జాతీయ నాయకుల విగ్రహాలకూ ముసుగులు వేస్తున్నారే! మరి ఇంటింటికీ పింఛన్ల పంపిణీని నిలిపేసి, ఆ నెపాన్ని విపక్షాలపైకి నెట్టేసి, లబ్ధిదారులైన పండుటాకుల్లాంటి వృద్ధుల్ని మంచాలపైకెత్తుకుని అధికార పార్టీ నాయకులు మండుటెండలో ఊరేగడం ఓటర్లను ప్రభావితం చేయడం కాదా? ఏప్రిల్ మొదటి వారంలో వైసీపీ నాయకులు చేసిన వీరంగాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా?
పోలింగ్ తేదీ అత్యంత సమీపంలోకి వచ్చేసిన తరుణంలో, మే మొదటి వారంలో మరోసారి అలాటి డ్రామాలకు అవకాశమిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? ఈ మాత్రం స్పృహ, ఆలోచన సీఎస్‌కు, ఎన్నికల సంఘానికి ఎందుకు లేవు? అంత సున్నితమైన విషయంలో వారెందుకు అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండే ఎండల్ని, పింఛనుదారులైన వృద్ధుల్ని ఇతర అభాగ్యుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా సముచిత నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏప్రిల్ 1వ తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా, మూడురోజులు ఆలస్యంగా ప్రారంభించారు. ఈసారి పంపిణీలో అలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా కావాలి. పైగా మే ఒకటో తేదీ బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని, ఒకటో తేదీన పింఛన్ల పంపిణీకి సిద్ధం కావాలని గ్రామ,వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సకాలంలో డబ్బు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు, ఇంటింటికీ పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా, అంతా సజావుగా సాగే అవకాశం ఉంటుంది.