Pension Distribution Arrangements in AP: ప్రజల వద్దకే పాలన అన్న దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అడుగు వేయనున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7 వేల రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లను నూతన ప్రభుత్వం అందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సిబ్బంది పింఛను నగదుతో పాటు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వం పింఛను కింద ఎంత నగదు అందిస్తోందో తెలిసేలా రసీదు ఇస్తారు. మరో రసీదుపై లబ్ధిదారుల సంతకం తీసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదిస్తారు. సామాజిక భద్రత పింఛనుదారులకు తొలి నుంచి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచింది.
2014లో టీడీపీ అధికారం చేపట్టగానే 200 నుంచి వెయ్యి రూపాయలకు ఒకేసారి 5 రెట్లు పెంచింది. ఆ తర్వాత మరో విడత వెయ్యి నుంచి 2 వేలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య ఏడాదికి 250 చొప్పున నాలుగు విడతల్లో వెయ్యి రూపాయిలు పెంచింది. ప్రస్తుతం పింఛనుదారులకు 3 వేల చొప్పున అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1,000 చొప్పున కలిపి మొత్తం 7 వేలు నేడు పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి ఒకేసారి 3 వేల పెంచి 6 వేల రూపాయల చొప్పున అందించనున్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితర 11 విభాగాలకు చెందిన వారికి ప్రస్తుతం అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచింది. దివ్యాంగులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భరోసానిచ్చారు. ప్రస్తుతం వారికి అందుతున్న రూ.3 వేలను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛన్‌ను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడీ చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యచరణను పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తారు. మొత్తం రూ.65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీకిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.