Pawan Kalyan Thankful for Polling Percentage Recorded in AP: ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదు కావటం ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యులైన వారికి అభినందనలు తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల కోసం ఓట్లేశారని వారి ప్రేమకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపుతున్నానని అన్నారు. పోలింగ్ సజావుగా జరిపిన ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగాన్ని పవన్ కల్యాణ్ అభినందించారు. ఎన్నికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన మీడియా, పౌర సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో అందరి సహకారంతో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం అభ్యర్థిగా ఆదరించి, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల వరకూ పోలింగ్లో ఓటింగ్ నమోదు చేశారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి పార్టీల కార్యకర్తలు వ్యవహరించారని అభినందించారు. పిఠాపురంలో తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెడతారని విశ్వాసం వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.
సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పిఠాపురంలో పోటీచేస్తున్నానని తెలియగానే అండగా ఉండేందుకు పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రచారం చేసిన సినీ, బుల్లితెర నటీనటుల ప్రేమ హదయాన్ని కదిలించిందని తెలిపారు. నా విజయాన్ని కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు అభినందనలు తెలిపారు. పిఠాపురంలో మార్పు కోసం ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలుపారు.
వైఎస్సార్సీపీ కనుసన్నల్లో అరాచక 'చైతన్యం' - DSP Chaitanya Violence