Parvatipuram Manyam Elephants Attack on Labour Auto : ఇటీవల వన్యప్రాణులు జనజీవనంలోకి వస్తున్న సంఘటను సర్వసాధారణమయ్యాయి. పులులు, జింకలుస, ఏనుగు, ఎలుగు, మొసలి ఇలా ఏదో ఒకటి జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలుగు దాడులతో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. ఇటీవల మామిడి తోటలో ఏనుగుల గుంపు సంచరించింది అంతే కాకుండా రైతుపై దాడి చెయ్యడంతో అతడి మృతి చెందాడు. తాజాగా కూలీలతో వెళ్తున్న ఆటోపై ఏనుగులు దాడి చేసిన ఘటన మన్యం జిల్లాలో జరిగింది.
మన్యం జిల్లా పార్వతీపురం మండలం బొండపల్లి సమీపంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. భవన నిర్మాణ పనుల నిమిత్తం కూలీలతో వెళ్తున్న ఆటోపై ఏనుగులు దాడికి యత్నించాయి. అప్రమత్తమైన కూలీలు ఆటోలో నుంచి దిగి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఏనుగుల దాడిలో ఆటో, కాంక్రీట్ మిల్లర్ ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కూలీ పనులకు వెళ్లేలాంటే భయాందోళన పరిస్థితులు ఉన్నాయని ఏనుగుల కట్టడికి అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చీకటి పడితే జనవాసాల్లోకి, పంట పొలాల్లోకి ఏనుగులు రావడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడేమో ఇలా పట్టపగలే దాడి పాల్పడ్డాయని భయాందోళన చెందుతున్నారు.
భయం'కరి' విధ్వంసం - తరచూ ప్రమాద ఘంటికలు - 'కుంకీలను పంపించండి'
గతంలో పీలేరు మండలంలో ఏనుగుల గుంపు సంచారం సంచలనం రేకెత్తించింది. సుమారు 15 నుంచి 20 వరకు ఏనుగులు సోమవారం రాత్రి పీలేరు మండలంలోకి ప్రవేశించాయి. వారం రోజులుగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఏనుగులు సంచరిస్తున్నట్లు అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. పక్కనే పీలేరు మండలం ఉండడంతో ఆ గుంపు ఇక్కడికి ప్రవేశించింది. పీలేరు మండల పరిధిలో ఏనుగుల సంచారం ఇదే మొదటిసారి. ఇవి ఒకసారి ప్రవేశించాయంటే ఆ ప్రాంతంలో ఉండే పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తాయి. కనపడిన మనుషులను తొక్కి చంపేస్తాయి.