Papikondalu Tour in AP : అలలుగా పొంగి నురగలై పారుతూ ఉరకలెత్తే గోదావరిని చూస్తే ఎవరి మనసు మాత్రం పరవశం కాకుండా ఉంటుంది. అటువంటి అందాల గోదారమ్మను కనులారా వీక్షించి, మనసారా ఆస్వాదించేందుకు వేళాయే. మొన్నటి వరకు వరదలతో నది చెంతకు చేరుకోలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు నదిలో విహరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పాపికొండల పర్వతశ్రేణుల నడుమ హొయలొలుకుతూ, వయ్యారాలు పోతూ సాగే నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తనున్నారు. రెండ్రోజుల కిందట పాపికొండల విహారయాత్రకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం, వీఆర్ పురం మండలం నుంచి విహారయాత్ర బోట్లు పర్యాటకులను తీసుకువెళ్లాడానికి సిద్ధంగా ఉన్నాయి.
పర్యాటకులకు గుడ్న్యూస్ - పాపికొండలు విహార యాత్ర షురూ - "ఆ ఒక్కటి' తప్పదంటున్న అధికారులు
ఎంత ఎదిగినా ఇక్కడ ఒదిగిపోయి : ఎన్నో ఉపనదులను తనలో కలుపుకొని వరదల సమయంలో ఉగ్రరూపం దాల్చి, సువిశాలంగా కనిపించే గోదావరి నది పాపికొండలు వద్దకు వచ్చే సరికి ఒదిగిపోయి వేగంగా ఉరకలెత్తుతుంది. కొండల నడుమ ప్రవహించే గోదావరి నది అలలను చూసి సందర్శకులు పరవశం చెందుతుంటారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని దేవీపట్నం మండలం పోశమ్మగండి రేవు నుంచి 12 బోట్లు, వీఆర్ పురం మండలం పోచవరం రేవు నుంచి 21 బోట్లును అందుబాటులో ఉంచారు.
సేద తీరేది ఇక్కడే : పర్యాటకులు పాపికొండలులో విహరించి సేదతీరే ప్రాంతం పేరంటాల పల్లి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ కుగ్రామం పర్యాటకంగా పెద్ద పేరు కలదు. నదీ విహారంలో అలసి సొలసిన సందర్శకులను బోట్లు ఈ గ్రామానికి చేర్చుతాయి. అక్కడ జలపాతంలో జలకాలు ఆడి, సమీపంలోని మునివాటాన్ని సందర్శిస్తారు. అక్కడ కొండరెడ్లు తయారుచేసే వెదురు కళాకృతులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఇక పర్వతశ్రేణులు అల్లూరి, ఏలూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
విజయవాడ సమీపంలో అతి పెద్ద రాజకోట - చైనావాల్ను తలపించే నిర్మాణాలు - కబుర్లు చెప్పే శిల్పాలు
బోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి : పాపికొండ విహారయాత్రలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఏలూరు జిల్లాలో బోటింగ్ పాయింటు లేకపోవటం అతి పెద్ద వెలితి. వేలేరుపాడు, పోలవరం మండలంలోని కోయిదాలలో బోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలనే అభ్యర్థనలు పర్యాటకుల నుంచి వినిపిస్తున్నాయి. వీటి ఏర్పాటు ద్వారా ఏలూరు జిల్లాలోని పోలవరం, కోయిదాలకు పాపికొండలు నుంచి త్వరగా చేరుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు అనువుగా ఉంటుంది.