Palnadu SP Bindu Madhav Suspension : పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పనీ తీరు గురించి సీఈవో మెచ్చుకున్నారు. మరి అలాంటి బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సస్పెండ్ చేసింది? ఎక్కడ తేడా జరిగింది. నిజానికి పల్నాడు జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వెనుక పోలీస్ బాస్‌లు, కింది స్థాయి అధికారుల సహాయనిరాకరణే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తన కింద పనిచేసే అధికారులు సిబ్బందిలో కొందరు వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారు. అలాంటి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని బిందుమాధవ్ కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని తెలుస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఆ పోలీసు అధికారులంతా బిందు మాధవ్‌కు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తోంది. రోడ్లెక్కి రాళ్లురవ్వుతున్న వైఎస్సార్సీపీ మూకల్ని నియంత్రించాలని ఎస్పీ ఆదేశించినా ఎవరూ లెక్కచేసినట్లు కనిపించలేదు.
Andhra Pradesh Post Poll Violence : పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్‌ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరిదారిన వారు ఆదేశాలివ్వడంతో ఎస్పీ ఏమీ చేయలేకపోయారు. చివరకు ఈసీ మాత్రం బిందుమాధవ్‌ను సస్పెండ్ చేసింది. శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా, ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో అక్కడి పరిస్థితుల్ని తరచిచూస్తే అర్థమవుతుంది.
హింసాకాండకు సహకరించిన కోవర్టు ఖాకీలపై చర్యలేవి సార్? - Election Violence in ap
ఎన్నికల సమయంలో పల్నాడులో చోటు చేసుకున్న పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. పల్నాడులో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పాత, కొత్త డీజీపీలతోపాటు సీఎస్ ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండకు బాధ్యులుగా పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పండ్ చేయాలని ఎన్నికల సంఘానికి సీఎస్ సిఫారసు చేశారు. నిజానికి వారిద్దరినీ నియమించింది ఎన్నికల సంఘమే. ఇక సీఎస్ బదిలీ చేయాలని సిఫార్సు చేసిన పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ మాత్రం రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ నియమించినవారు.
బిందుమాధవ్‌ను అప్పటి డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మొదటి నుంచీ శత్రువులా చూశారని, ఏ విషయంలోనూ సహకరించలేదని పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేసిన కొందరు డీఎస్పీలు, సీఐలు, కిందిస్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందుమాధవ్ నివేదిక సమర్పించినా అప్పటి డీజీపీ వారిని బదిలీదు. ఫలితమే ఈసీ చేతిలో సస్పెన్షన్ వేటుకు తాజాగా గురైన గురజాల డీఎస్పీ పల్లంరాజు, నరసరావుపేట డీఎస్పీ వర్మ. కిందిస్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేయడంతో కొన్నిచోట్లకు ఎస్పీ వెళ్లి అల్లరిమూకల్ని చెదరగొట్టాల్సి వచ్చింది.
పోలింగ్ రోజున నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపేస్తారని పోలీసులు బదులిచ్చారు. ఇకనరసరావుపేట ఎమ్మెల్యే వెంట 70 నుంచి 80 మంది 10 వాహనాల కాన్వాయ్‌తో తిరిగాయి. అన్ని వాహనాలకు ఎందుకు అనుమతించారని బిందుమాధవ్ అడిగితే రెండే వాహనాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే గోపిరెడ్డిని గృహనిర్బంధం చేయాలని, తన అనుమతి లేకుండా ఆయన్ను బయటకు పంపొద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే గోపిరెడ్డి మున్సిపల్ స్కూల్ దగ్గర కనపడటంతో బిందుమాధవ్ అవాక్కయ్యారు. ఎందుకు వదిలేశారని అడిదితే ఓటు వేస్తానంటే బయటకు పంపామని పోలీసులు బదులిచ్చారు.
ఇక మాచర్ల నియోజకవర్రగం కండ్లకుంటలో టీడీపీ, ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేసి సాయం కోరితే వారిని ఆదుకోవడానికి రాకపోగా ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి డీఎస్పీ చెప్పారు. ఫలితంగా బాధితులపై రెండోసారి దాడికి పాల్పడ్డారు. పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వందలమందితో కారంపూడి వెళ్లి టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, పలువుర్ని కొట్టారు. కారుకు నిప్పుపెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు అధికారపార్టీకి ఏజెంట్లలా పని చేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని అనుమానం వచ్చిన వారిని అరెస్ట్ చేయాలని ముందురోజు ఎస్పీ ఆదేశిస్తే వారిలో 30 మందిని వదిలేశారు. టెలికాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాల్ని ఎప్పటికప్పుడు అధికారపార్టీ నాయకులకు పోలీసులు చేరవేసేవారని తెలుస్తోంది! అభ్యర్థుల వాహనాల్ని ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వారు చేయకపోగా, ఆ సమాచారాన్ని వారికి చేరవేశారు. హింసాత్మక ఘటనల్లో ఫలానా వాళ్లను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే అధికారపార్టీ కార్యకర్తలను స్వేచ్ఛగా వదిలేశారు.
అన్నివైపుల నుంచి ఎదురైన సహాయ నిరాకరణతో ఎస్పీ బిందుమాధవ్ దాదాపు ఒంటరి అయ్యారు. కిందిస్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేయడంతో మొత్తం గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంకు తరలించి, తెల్లవారుజాము ఐదు గంటల వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు.
Anantapur SP Amit Bardar Suspension : అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌కూ అదే తరహా సహాయనిరాకరణ ఎదురైంది. స్పెషల్ బ్రాంచ్ సీఐ జకీర్‌ను బదిలీ చేయాలని, అప్పటి డీఐజీ అమ్మిరెడ్డిని అమిత్ బర్దర్ కోరినా పట్టించుకోలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ ఎస్పీకి సహకరించకపోవడం, వైఎస్సార్సీపీ నాయకులతో కుమ్మక్కవడం వల్లే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడులకు కారణంగా కనిపిస్తోంది.
తాడిపత్రిలో ఘర్షణల నేపథ్యంలో అదనపు బలగాల్ని పంపాలని ఎస్పీ కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని, చివరకు ఎస్పీయే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఆ క్రమంలో ఆయనకూ గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వైఎస్సార్సీపీకి కొమ్ముకాసే డీఎస్పీ వీఎన్‌కే చైతన్యను అమిత్ బర్దర్‌కు తెలియకుండా, కర్నూలు రేంజి డీఐజీ విజయారావు రాజంపేట నుంచి తాడిపత్రికి పిలిచించారనే చర్చ నడుస్తోంది.
ఇక మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహార శైలిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ స్థాయిలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఒక్కసారైనా సమీక్షించని జవహర్‌రెడ్డి ఎస్పీలు, కలెక్టర్‌ల సస్పెన్షన్‌కు సిఫార్సు చేయడమేంటని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల బందోబస్తుకు 34 కంపెనీల బలగాలు కావాలని కోరితే, 19 కంపెనీల బలగాల్నే ఇచ్చి సర్దుకోమన్నారని అధికారులు చెబుతున్నారు. తీరా అక్కడ శాంతిభద్రతల సమస్యల తలెత్తితే ఆ నెపాన్ని జిల్లా అధికారులపై వేసేసి, ఉన్నతాధికారులు తప్పించుకున్నారనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.