Palla Srinivasa Rao on Amaravathi And Polavaram : రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ఏర్పాటును ప్రజలంతా హర్షిస్తున్నారని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతోందని గర్వంగా చెబుతున్నామన్నారు. అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేయడమే మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యంమని తెలిపారు. ఆర్థిక రాజధానిగా విశాఖను చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.
దేశంలోనే నంబర్ వన్ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైఎస్సార్సీపీదని ధ్వజమెత్తారు. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. విశాఖకు మళ్లీ పూర్వవైభవం కల్పించే బాధ్యత మాది’’ అని పల్లా శ్రీనివాస్‌రావు యాదవ్ పేర్కొన్నారు.