Veligonda irrigation project: సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడమంటే నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిగా లేదా కొంతవరకైనా నీళ్లివ్వాలి. తాగునీరు అందించాలి. ఈమేరకు నిర్మాణ పనులు పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. జగన్ మాత్రం తన అయిదేళ్ల పాలనాకాలంలో ఈ పని పూర్తి చేయలేకపోయారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, కరవు ప్రాంతానికి నీరందిస్తామని గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగి మరీ చెప్పిన జగన్ ఇప్పుడు మాట నిలబెట్టులేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వస్తున్నందున కేవలం రెండు టన్నెళ్లను మాత్రమే జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలంటే ఇంకా చాలా పనులు పూర్తి చేయాలి.
ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసినట్లు హడావుడి: ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇందుకు వేల కోట్ల నిధులు కావాలి. ఒక టన్నెల్ సింహభాగం ఎప్పుడో టన్నెల్ బోరింగు మిషన్‌తో పూర్తి చేశారు. రెండో టన్నెల్‌ను హడావుడిగా మనుషుల సాయంతో, కొంతభాగం యంత్రాలతో తవ్వించారు. ఇంకా లైనింగు పనులు పూర్తి చేయలేదు. రెండు టన్నెళ్లు తవ్వి ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసినట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా కూడా ఆయకట్టుకు అందించేలా పనులు పూర్తి చేయలేదు. టన్నెళ్లు తవ్వడంతో పాటు నల్లమలసాగర్‌లో నీటిని నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పూర్తి చేసి, అక్కడి నుంచి జలాలను ఆయకట్టుకు తరలించేలా పనులు చేసి ఉంటే కరవు ప్రాంత ప్రజలు సంతోషపడేవారు.
అసంపూర్తిగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - నేడు ప్రారంభించడానికి జగన్ సిద్ధం
ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు హంగామా: శ్రీశైలం వరద జలాలను కరవు నేలకు అందించి పచ్చని సీమగా మార్చేందుకు ఉద్దేశించింది వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు నీరందించడం, లక్షలమంది ప్రజలకు తాగునీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. టన్నెళ్ల తవ్వకానికి, పునరావాసానికి, ఆ పైన జలాశయాల నిర్మాణానికి, కాలువల తవ్వకానికి సమాంతరంగా జగన్ సర్కార్ సరిపడా నిధులిచ్చి ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసి ఉంటే ఈ లక్ష్యసాధనకు అయిదేళ్ల సమయం సరిపోయేది. అయితే సరైన ప్రణాళిక లేక, చాలినన్ని నిధులివ్వక జగన్ సర్కారు ప్రాజెక్టును ముందుకు కదపలేకపోయింది. అయిదేళ్లు పూర్తయిపోయి మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో కేవలం టన్నెళ్ల తవ్వకంతోనే ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు హంగామా చేసింది.
బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు: నల్లమల అడవుల్లో ఉన్న కొండలను సొరంగాలుగా తొలిచి, శ్రీశైలం జలాశయం నుంచి వాటి ద్వారా నీళ్లు తెచ్చి జలాశయంలో నింపేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దాదాపు 18.89 కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాల తవ్వకం అనేక ఏళ్లుగా దశలవారీగా పూర్తి అయింది. అటవీ, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం కావడంతో ఆ నిబంధనల మేరకు టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగాలు తవ్వాలని నిర్దేశించారు. టీబీఎంతో సొరంగాన్ని తవ్వుతూ అదే సమయంలో లైనింగు వేసి, ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలనేది ప్రణాళిక. దీనిలో భాగంగా తొలి టన్నెల్‌లో సింహభాగం పూర్తయింది. జగన్ సర్కార్ హయాంలో టీబీఎం పని చేయకపోవడంతో బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు సాగించారు. రెండో టన్నెల్‌లో లైనింగు పనులూ పూర్తి చేయలేకపోయారు. కొన్ని పనులు పెండింగులో ఉండగానే టన్నెళ్ల తవ్వకం పూర్తయిందనిపించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగాన్ని ప్రారంభించిన సీఎం జగన్ - నిర్వాసితులను ఆదుకుంటామని భరోసా