Ongole GGH Giving Quality Less Food for Patients : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు సరైన భోజనం అందక నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి పేద ప్రజలు రిమ్స్ హాస్పిటల్‌కి చికిత్స కోసం వస్తారు. అయితే, ఇక్కడి పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. రోగులకు మూడు పూటలా భోజనం పెట్టకుండా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోగులతో పాటు వారి సహయకులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలం నుంచి రోగులకు సరైన భోజనం ఏర్పాటు చేయకపోవడంతో సంబంధిత అధికారులకు అనేక మంది ఫిర్యాదులు చేశారు. అయినా, ఎటువంటి ఫలితం లేదని రోగులు, వారితో వచ్చిన సహాయకులు వాపోతున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో నీటి కష్టాలు - విద్యార్థులు, వైద్యుల పాట్లు
పెట్టే అరకొర భోజనం కూడా నాశిరకంగా ఉందని రోగులు మండిపడ్డారు. సరైన కూరలు చేయకపోవడంతో తినలేని పరిస్థితి ఏర్పడుతుందని రోగులు వాపోతున్నారు. హాస్పిటల్లో పెట్టే భోజనం రోగులు తినలేక బయట భోజనం ప్యాకెట్లు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. మోను ప్రకారం ప్రతిరోజు గుడ్లు, అరటిపండు ఇవ్వకుండా భోజనం పెడుతున్నారని తెలిపారు. రెండు రోజుల నుంచి సక్రమంగా భోజనం పెట్టడం లేదని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో ఉండలేక హోటల్లో ఒక ప్యాకెట్ కొనుక్కొని ముగ్గురూ తింటున్నామని తెలిపారు. అధికారులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైన స్పందించి తక్షణమే సరైన భోజనం అందించాలని రోగులు, సహయకులు కోరుకుంటున్నారు.
"ఆసుపత్రిలో నాశిరకం భోజనంతో పాటు, చాలీ చాలని భోజనం అందిస్తున్నారు. ఎంతో ఆకలితో ఉన్న కొద్దిగా కూడా తినలేకపోతున్నాం. ఈ రోజు ఉదయం, మధ్యహ్నం రెండు పూటల భోజనం పెట్టాలేదు. కడుపు మాడిపోయి ఒక ప్యాకెట్ భోజనం తెచ్చుకొని ముగ్గురు తిన్నాము. అలాగే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు." - లక్ష్మీదేవి, రోగి కుటుంబ సభ్యులు
"ఇక్కడి రోగులు,సహయకులకు ఒక కాంట్రాక్ట్ సంస్ధ ద్వారా భోజనం అందిస్తున్నాం. అయితే ఆసుపత్రికి వస్తున్న రోగులకు నాశిరకం భోజనం పెడుతున్నారనే ఫిర్యాదులు చాలా వచ్చాయి. ఈ విషయంపై ఆ సంస్థకు మెమోను జారీ చేశాము. తరువాత మేమే స్వయంగా వెళ్లీ తనిఖీలు నిర్వహించాము. చివరికి ఆసుపత్రిలో నాశిరకం భోజనంతో పాటు వంటగది అపరిశుభ్రంగా ఉందని నిర్ధారణకు వచ్చాము. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. భోజన కాంట్రాక్ట్‌ను మరోక సంస్థకు ఇవ్వాలని వారు సలహ ఇచ్చారు. దాని ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాం. మరో మూడు రోజుల్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కరం అవుతుంది." - దుర్గాదేవి, రిమ్స్ హాస్పిటల్ సూపర్డెంట్
కనీస సౌకర్యాలు లేని ఒంగోలు సర్వజన ఆస్పత్రి - ఆందోళనలో రోగులు - Lack Of Facilities in Ongole GGH