Old Man Get Land Compensation After 42 Years : భూసేకరణ కింద తన భూమిని తీసుకుని పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వంపై న్యాయస్థానంలో పోరాడి గెలిచిన 81 ఏళ్ల వృద్ధుడి విజయగాథ ఇది. ప్రస్తుతం కదలలేని స్థితిలో మంచంపైనే ఉంటున్న ఆయన 42 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తన హక్కును సాధించుకున్నారు.
Struggle For Land Compensation : కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడకు చెందిన ఓలేటి వెంకట నారాయణకు 87 సెంట్ల స్థలం ఉండేది. ఉప్పుటేరు డ్రెయిన్ నిమిత్తం అధికారులు ఆ భూమిని 1894 భూసేకరణ చట్టం కింద 1982లో స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూ యజమానులు అప్పట్లోనే కోర్టుకు వెళ్లి ఎకరాకు రూ.5,002.50 పరిహారం పొందారు. కానీ వెంకటనారాయణకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. దీంతో ఆయన 2009లో హైకోర్టును ఆశ్రయించారు. వెంకటనారాయణ పిటిషన్‌పై 2023 జూన్‌లో సింగిల్ జడ్జి తుది విచారణ జరిపారు. ఎకరాకు రూ. 5,003 చొప్పున 6% వడ్డీతో లెక్కించి పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
తప్పుడు ఆఫర్‌తో మోసం.. రూ.60 కోసం పదేళ్లు పోరాడిన వ్యక్తి.. కోర్టు ఏమందంటే?
అయితే 2013లో అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించేందుకు నిరాకరించారు. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌దారు అప్పీల్ దాఖలు చేశారు. ఇటీవల ఈ అప్పీలును విచారించిన జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ ఎన్.హరినాథ్‌తో కూడిన ధర్మాసనం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 87 సెంట్లకు ప్రస్తుత మార్కెట్ ధరను నిర్ణయించి 4 నెలల్లో పిటిషనర్‌కు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. దీంతో పాటు ఆ వృద్ధుడికి అప్పట్లో ఇవ్వాల్సిన రూ.5,003 పరిహారం సొమ్ముతో పాటు, స్థలాన్ని సాధీనం చేసుకున్న తేదీ 1982 ఫిబ్రవరి 16 నుంచి 9% వడ్డీ లెక్కించి 3వారాల్లో చెల్లించాలని ఈనెల 25న తీర్పులో పేర్కొంది.
హక్కును హరించడానికి వీల్లేదు : రైతుకు పరిహారం చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోలేని లక్షల మందిలో పిటిషన్‌దారు ఒకరని తెలిపింది. సముచితమైన పరిహారం పొందేందుకు ఆయనకు ఉన్న హక్కును హరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వయోభారంతో మంచంపై ఉన్న పిటిషనర్‌కు ఈ పరిహారం, మద్దతు ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. భూసేకరణ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదేనని, అలాగని యజమానికి పరిహారం చెల్లించకుండా ఆస్తులను తీసేసుకోలేరని ధర్మాసనం తెల్చి చెప్పింది.