Administration changes in AP: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి ముందే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు పనిమొదలు పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆదేశాలకు అగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు చేపట్టారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు - సీఎస్ సమీక్ష - Nara Chandrababu Naidu oath as CM
వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ప్రత్యేకదృష్టి పెట్టారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు వివిధ ఆదేశాలు జారీచేశారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు సాగుతున్నాయి. పిచ్చి మొక్కల తొలగింపు, రోడ్లు బాగుచేడంతో పాటు గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సిద్దం అవుతున్నారు.
పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్ కో లలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధిదీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం పై దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో కొద్దిరోజుల క్రితం కలుషిత తాగునీటి తో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు, ఏ మాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు.
ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో డిజిపి హరీశ్ కుమార్ గుప్త, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.