Officials And YCP Ruling Members Fogging Scam in Anantapur Municipality: అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం అవినీతి పరాకాష్టకు చేరింది. దోమల నివారణకు సాయంత్రం వేళ పొగ వదలకుండానే ఫాగింగ్ పేరుతో లక్షల రూపాయలు కాజేశారు. పనిచేయని ఫాగింగ్ యంత్రాలకు డీజిల్ పోస్తున్నామంటూ ప్రతినెలా లక్షల రూపాయలు మింగేశారు. దోమల బెడద తొలగించాలని ప్రజలు నిత్యం నగరపాలక సంస్థ అధికారులకు మొరపెట్టుకుంటుంటే, అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పుస్తకాల్లో ఫాగింగ్ చేస్తూ డీజిల్ రూపంలో డబ్బును స్వాహా చేశారు.
నగరపాలక సంస్థలో దోమల నివారణకు ఫాగింగ్ పేరుతో పాలకవర్గం, కార్పొరేషన్ అధికారులు లక్షలు కాజేస్తున్నారు. నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయడానికి ఓ భారీ యంత్రంతో పాటు, చేతితో ఆపరేట్ చేసే ఎనిమిది చిన్న యంత్రాలు ఉన్నాయి. వాటితో కనీసం మూడు డివిజన్లలో కూడా పూర్తిగా ఫాగింగ్ చేయలేరని సిబ్బంది చెబుతున్నారు.
ఫాగింగ్ యంత్రంతో పొగ వదలడం వల్ల దోమల పునరుత్పత్తి ఆగిపోయి, వాటి నిర్మూలన జరుగుతుంది. ఈ ఫాగింగ్ చేయడానికి ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి 7.30 లోపు పూర్తి చేయాలని నిపుణులు చెప్పారు. వీటిలో భారీ ఫాగింగ్ యంత్రం మూడు సంవత్సరాల క్రితమే మూలనపడింది. తమ వద్ద ఉన్న అన్ని యంత్రాలతో నగరమంతా ఫాగింగ్ చేస్తున్నట్లు చెప్తున్న అధికారులు డీజిల్ కోసం నెలకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చూపుతున్నారు.
ఫాగింగ్ యంత్రం రెండు సంవత్సరాల నుంచి పని చేయకపోయిన లక్షల్లో ఖర్చులు పుస్తకాల్లో రాస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకుంటాం. ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు జరిగాయానేది రికార్డ్స్‌లో ఉన్న వాటిని పరిశీలించి దీనిపై కమీషనర్ చర్యలు తీసుకుంటారు. - డా.విష్ణుమూర్తి, హెల్త్ ఆఫీసర్
నగరంలోని 74 సచివాలయాల పరిధిలో అన్ని చోట్లా యంత్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పనిచేయని భారీ ఫాగింగ్ యంత్రానికి రోజూ 80 లీటర్ల డీజిల్ పోస్తున్నట్లుగా చూపిస్తూ నెలకు సుమారు మూడు లక్షల మేర మింగేశారు. మిగిలిన ఎనిమిది చిన్న యంత్రాలకు రోజూ సుమారు 8 వేల రూపాయలు ఖర్చును రికార్డుల్లో రాస్తున్నారే తప్ప ఫాగింగ్ చేస్తున్న దాఖలాలు లేవు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఓ అధికారి వద్దకు దొంగ బిల్లులు రావడంతో వైఎస్సార్సీపీ పాలకవర్గం అవినీత భాగోతం వెలుగులోకి వచ్చింది. నగరపాలక సంస్థలో వెలుగుచూసిన ఫాగింగ్ అక్రమాలపై విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు వెలుగుచూస్తాయని స్థానికులు అంటున్నారు.
అమ్మకానికి పారిశుద్ధ్య ఉద్యోగాలు- తీరు మార్చుకోని పాలకవర్గం - Sanitation Jobs For Sale