Officers Negligence in Jal Jeevan Mission Implementation : కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జలజీవన్ పథకం అమల్లో అధికారులు మొద్దు నిద్రవీడడం లేదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యదర్శి నుంచి అన్ని విభాగాల్లో ఉదాసీనతే కనిపిస్తోంది. గత ఐదేళ్లలో ప్రారంభించని పనులు రద్దు చేసి కొత్త డీపీఆర్‌లు రూపొదించడంలో కాలయాపన చేస్తున్నారు. వచ్చే 45 రోజుల్లో డీపీఆర్‌లు సిద్ధం అవుతాయని తాపీగా చెప్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో జల్‌జీవన్ మిషన్ పథకం పనులు కేంద్రప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా చేపట్టారు. కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం గ్రామాల్లో పలు చోట్ల బోర్లు తవ్వించారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటినప్పుడు బోర్లు పని చేయకపోతే నీటి సరఫరా సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పనులను జలాశయాలతో అనుసంధానించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న జలాశయాల్ని గుర్తించాలని అధికారులకు నిర్దేశించింది.
ఇందుకోసం 13 జిల్లాల్లో రూ. 40 వేల కోట్ల విలువైన పనులకు 13 డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు మూడు నెలల క్రితమే అధికారులను ఆదేశించారు. అక్టోబరులోనే టెండర్లు పిలిచినా డీపీఆర్‌ల తయారీకి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయలేదు. ముందుగా గత ఐదేళ్లలో ప్రారంభానికినోచుకోని పనుల్ని రద్దు చేయాల్సి ఉంది. ఆయా రద్దు ప్రతిపాదనలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎటూ తేల్చడంలేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి పేషీకి ఏ దస్త్రం వెళ్లినా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జలజీవన్ మిషన్ పథకం గడువు మరో 4నెలల్లో ముగియనుంది. ఈలోగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి అదనపు సాయం కోరి, ప్రాజెక్టు గడువును మరో రెండేళ్లు పొడిగించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కానీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖతోపాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో అధికారులు చురుగ్గా కదలడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తేతప్ప కదలిక వచ్చేలా లేదనే పరిస్థితి కనిపిస్తోంది. జలజీవన్ మిషన్ పనుల పునరుద్ధరణ, ప్రారంభించని పనుల రద్దు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ చెప్తున్నారు. ఏయే పనులు రద్దు చేయాలి? వేటిని కొనసాగించాలనే పరిశీలన జరుగుతోందని వచ్చే 35నుంచి 45 రోజుల్లో డీపీఆర్‌లు సిద్ధమవుతాయని.. అంటున్నారు.
ఒకవైపు భారీ వర్షాలు - మరోవైపు తాగునీటి కష్టాలు - అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు - Severe Water Crisis in Kurnool