Officers Neglect Repairing Drains in Guntur District : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతను అధికారులు నిజం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పశ్చిమ డెల్టాలో కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు చేపట్టకుండా జాప్యం చేస్తున్నారు. డెల్టా కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదలై సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నా కాలువల్లో పూడికతీత, గేట్ల మరమ్మతుల పనులు ఇంకా చేపట్టలేదు. తూటుకాడ, గుర్రపు డెక్క దట్టంగా పేరుకుపోయి, కట్టలు కోతకు గురై బలహీనపడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాపట్ల జిల్లా పరిధిలో సాగునీటి కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించినా ప్రారంభించకుండా అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వక కృష్ణాడెల్టాలో కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. భారీ వర్షాలకు పంట మునిగితే సరైన డ్రెయిన్లు లేక వరద వెళ్లక పైరు మునికి నష్టపోయారు. కాలువల బాగు , గేట్లు మరమ్మతులే ఇందుకు పరిష్కారమని తెలిసినా అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు.
భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద- ఎల్ఎల్సీ కాలువలో లీకేజీని గుర్తించిన అధికారులు
వేమూరు నియోజకవర్గ పరిధిలో 19 పనులు చేయటానికి కోటి ఎనిమిది లక్షలు కేటాయించారు. 12 పనులకు టెండర్లు ఇంకా తెరవలేదు. 16 వేల ఎకరాలకు సాగు నీరందించే వరహాపురం ఛానల్‌లో గుర్రపుడెక్క, తూటుకాడ పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. తుంగభద్ర సైడ్ ఛానల్ పరిధిలో కాలువ కట్టలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. భారీ వర్షాలకు కట్టలు తెగి, గండ్లు పడేలా ఉన్నాయి.
కొల్లూరు వద్ద లాకులు తీవ్రంగా దెబ్బతిని, పడవల వంతెన గేట్లు శిథిలావస్థకు చేరాయి. ఎగువ పొలాలకు సక్రమంగా నీరందటం లేదు. దిగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయి. 2 గేట్లలో ఒకటి పూర్తిగా శిథిలమైంది. రెండో గేటులో సగం మేరకు దిగువ భాగంలో తుప్పు పట్టి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. గేటుకు ఉన్న భారీ రంధ్రాల మీదుగా నీరు దిగువకు పోకుండా అడ్డుగా ఇసుక మూటలను పేర్చారు. ఈ ఇసుక మూటల పరిష్కారం ఏ మాత్రం ఫలితం ఇవ్వక నీరు దిగువకు పోతూనే ఉంది.
కూలిపోయే స్థితిలో వంశధార కుడికాలువ వయాడక్ట్ - Vamsadhara right canal damage
పర్చూరు నియోజకవర్గంలో 8 పనులకు రూ. 43.15 లక్షలు, చీరాల పరిధిలో ఓ పనికి 11 లక్షల కేటాయించారు. టెండర్లు పూర్తయినా పనులు మొదలుకాలేదు. కృష్ణా డెల్టాలో ప్రధానమైన కొమ్మమూరు కాలువలో ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. మిగ్‌జాం తుపాను సమయంలో పడిన గండ్లను పూర్తిగా పూడ్చాలని లేకుంటే పంట పొలాలు మునిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
బాపట్ల నియోజకవర్గంలో 12 పనులు చేపట్టడానికి రూ.75.89 లక్షలు కేటాయించారు. పీటీ ఛానల్‌లో మరమ్మతులు చేపట్టక బాపట్ల, కర్లపాలెం మండలాల్లో చివరి ఆయకట్టులోని 8 వేల ఎకరాలకు నీరు అందడం లేదు. నరసాయపాలెం ఛానల్, మురుకుండపాడు ఛానల్‌లో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. కాలువలను బాగు చేయకపోతే 12,000 ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందదు. ఆరమండ ఛానల్‌లో ఇంకా పూడిక పనులు చేపట్టలేదు. రేపల్లె నియోజకవర్గం పరిధిలో 9 పనులకు రూ. 47.67 లక్షలు కేటాయించారు. వీటిలో నాలుగింటికి సంబంధించి టెండర్లు ఇంకా తెరవలేదు. నిజాంపట్నం ఛానల్ అధ్వానంగా ఉంది. లాకులు, షట్టర్లు దెబ్బతిన్నాయి. రేపల్లె, నగరం, చెరుకుపల్లిలోని సాగునీటి కాలువల్లో పూడిక పనులు చేపట్టకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందదు. వర్షపు నీరు పొలాల బయటకు పోయే దారి కరవై ఏటా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు ఉన్నా విడుదల చేయని అధికారులు - రైతుల్లో ఆందోళన - water not released to kc canal
కొల్లూరులో టెండర్లు పిలిచినా కొన్ని పనులకు గుత్తేదారులు రాలేదని అధికారులు తెలిపారు. సాంకేతికపరమైన సమస్యల వల్ల కొన్ని పనుల టెండర్లు తెరవలేదంటున్న అధికారులు కొత్తగా టెండర్లు పిలవాలా లేదా పనులు చేయాలా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాలువల్లో మరమ్మతులు వెంటనే ప్రారంభిస్తామన్నారు.
కొమ్మమూరు కాలువకు నిలిచిన సాగునీరు - ఎండిపోతున్న పంటలు