Atchutapuram SEZ Reactor Blast Updates : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటన్నర ముందే సిబ్బందికి ప్రమాద సంకేతాలు అందినట్లు సమాచారం. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే మిథైల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) రసాయన లీకైంది. అయినా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కంపెనీ అధికారులు తేలిగ్గా తీసుకోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫ్యాక్టరీ తనిఖీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణమే వారు స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదనే భావనకు వచ్చారు.
ఈ మేరకు ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలను వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 21న ఎసెన్షియా కంపెనీలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనే రెండో అంతస్తులో ఎంటీబీఈ రసాయనం లీకైంది. ఈ విషయాన్ని విషయాన్ని ప్రొడక్షన్ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే స్వీట్ లిక్కర్ వాసన రావడాన్ని కొందరు గమనించారు. ఆ తర్వాత మొదటి అంతస్తులోనూ అదే వాసన రావడంతో వారు అప్రమత్తమయ్యారు.
అప్పుడు మధ్యాహ్న భోజన సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లీకేజీని అరికట్టేందుకు ముందుకు రాలేదు. అలా గంటన్నర సమయం గడిచిపోయింది. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు (ఏహెచ్‌యూ) ద్వారా లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి రూపంలో అన్ని గదులకు వ్యాపించింది. అత్యంత పేలుడు గుణం ఈ రసాయనంలో ఉంటుంది. ఇందులో కొన్ని చుక్కలు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రిక్ ప్యానల్స్‌పై పడ్డాయి. దీంతో చిన్న స్పార్క్ రేగి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో భారీ పేలుడు జరిగింది. అప్పుడే గోడలు, సీలింగ్ కూలిపోయాయి. వాటి కింద కొందరు పడి మరణించారు.
Atchutapuram Incident Updates : సమీపంలో ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా 5-10 సెకన్ల వ్యవధిలోపే అదే ఫ్లోర్‌లో ఏహెచ్‌యూ మెయిన్ ప్యానల్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ ధాటికి అందులోని పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియా మొత్తం ధ్వంసమైంది. అక్కడ సిబ్బంది ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు కర్మాగార నిర్మాణంలోని లోపాలు కార్మికుల పాలిట శాపాలుగా మారాయి. అత్యవసర సమయాల్లో కంపెనీ నుంచి బయటపడే మార్గమే లేదు.
అచ్యుతాపురం దుర్ఘటన- బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదన - Tragedy in Victims Families