Odisha Plastic Dumped In Srikakulam District People Suffering : ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చే వ్యర్థాలతో సరిహద్దు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతం పర్లాకిమిడి మున్సిపాలిటీ నుంచి రోజూ టన్నులు కొద్దిగా ప్లాస్టిక్, మెడికల్, వ్యర్ధాలు కాలువల ద్వారా గ్రామస్థుల పొలాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా పంట పొలాలు ప్లాస్టిక్ మయంగా మారి నిరుపయోగంగా మారడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏళ్ల నుంచి వేధిస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలంటూ గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Srikakulam Groundwater Polluted Due to Odisha Plastic Wastage : ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె. గోపాలపురం, హెచ్. గోపాలపురం గ్రామాలు ఉన్నాయి. పర్లాకిమిడి మున్సిపాలిటీలోని ఆసుపత్రి వ్యర్ధాలు, నివాసాల్లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు, జంతువుల కళేబరాలను కాలువ ద్వారా దిగువ ప్రాంతాల్లోకి విడిచి పెడుతున్నారు. మొదట్లో దీనిని ఎవరూ అంతగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యర్ధాల సంఖ్య ప్రస్తుతం టన్నుల్లో పెరిగి సమీప గ్రామాలు కాలుష్య కారకాలుగా మారాయి.
దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సమస్యను ఆంధ్ర సరిహద్దు ప్రాంత అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేశారు. ప్రస్తుతం దాదాపు 70 ఎకరాల్లోకి మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరడంతో పొలాలు నిరుపయోగంగా మారాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
'ఒడిశా ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు సరిహద్దు గ్రామాల్లోని భూగర్భ జలాల్లో కలిసి విషతుల్యం అవడంతో స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. వైద్య సంబంధ పరికరాలు, ఇంజక్షన్లు, సీసాలు వంటివి పొలాల్లోకి చేరడంతో రైతులు గాయాలపాలవుతున్నారు. వర్షాకాలంలో అయితే ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఈ పరిస్థితి మరింత పెరిగింది గత పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం దక్కలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపి గ్రామస్తుల ఆరోగ్యం కాపాడాలని కోరుతున్నాం.' -స్థానికులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిపారు. ఒడిశా అధికారులతో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు.