Octopus Squad Mock Drill at Vijayawada Bus Stand: సమయం ఆదివారం రాత్రి 2 గంటలు, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకట్లు, ఎటు చూసినా అంధకారం. ఓ సిటీ ఆర్డినరీ బస్సు వేగంగా ప్లాట్ ఫాం పైకి వచ్చి ఆగింది. ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లతో అక్కడికి చేరుకున్న దళాలు చేతిలో తుపాకీలు పట్టుకుని బస్సెక్కాయి.
కొందరు బస్సును చుట్టుముట్టారు. మరికొందరు మెరుపు వేగంతో బస్సులోకి దూసుకెళ్లి ఓ అగంతకుడిని పట్టుకొచ్చారు. నేలపై తోసి వీపుపై తుపాకులు పెట్టి కాల్చబోయారు. నిందితుడు లొంగిపోవడంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. క్షణాల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్ మొదటి అంతస్తులోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అలజడి రేగింది. ఓ అగంతుకుడు చీకట్లో పరుగులు తీశాడు. రాత్రి వేళ కార్యాలయం లోపలికి దూరి బాంబులు పెట్టారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. క్షణాల్లో పెద్దసంఖ్యలో ఆక్టోపస్ దళాలు మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. నిమిషాల్లోనే నకిలీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రెప్పపాటులో జరుగుతున్న పరిణామాలతో అందరిలోను ఆందోళన చెలరేగింది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు నిందితుడు లొంగిపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. చివరగా బస్టాండ్‌లోని ప్రయాణికుల భద్రతలో భాగంగా ఆక్టోపస్ దళాలు చేసిన మాక్‌డ్రిల్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.
పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోకి ఉగ్రవాదులు జొరబడినట్లిగా భావించిన దళాలు క్షణాల్లో రంగంలోకి దిగి ఉగ్రవాదుల పని పట్టాయి. కాల్పుల్లో, కొందరు గాయపడినట్లుగా సృష్టించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలియజేశాయి. మాక్‌డ్రిల్ ప్రారంభంలో భయాందోళనలకు గురైన పలువురు ప్రయాణికులు ఇదంతా ఉత్తుత్తేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
ఆదివారం రాత్రి సుమారు గంటన్నర పాటు ఆక్టోపస్ దళాలు చేసిన సాహసకృత్యాలు ప్రయాణికులను ఆశ్చర్యపడేలా చేశాయి. మాక్‌డ్రిల్‌లో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 35 మంది ఆక్టోపస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. బెజవాడ బస్టాండ్‌లో భద్రత పటిష్టతపై ఆక్టోపస్ దళాలు స్థానిక పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశాయి. దేశంలో అక్కడక్కడ ఉగ్ర చర్యలు జరుగుతున్న దృష్ట్యా ప్రజల రక్షణ కోసం భద్రతా పరంగా నిరంతరం ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు.